ప్రజాస్వామ్యమా? పైసలస్వామ్యమా?

27 Oct, 2017 00:31 IST|Sakshi

సామాజిక సంఘీభావ ఐక్యకార్యాచరణ కమిటీ మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 28న సామాజిక సంఘీభావ కమిటీ తలపెట్టిన విజయవాడ సభకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి 144 సెక్షన్‌ విధించడంపై సామాజిక సంఘీభావ ఐక్యకార్యాచరణ కమిటీ మండిపడింది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ జరిపి తీరుతామని స్పష్టం చేసింది. చంద్రబాబు కాపాడాలనుకుంటున్నది ప్రజాస్వామ్యాన్నా లేక, పైసలస్వామ్యాన్నో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసింది. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీలే తన వెన్నెముక అన్న చంద్రబాబు ఈ రోజు వాళ్లు పెట్టుకుంటున్న సభ జరగకుండా కుయుక్తులు పన్నుతుండటం శోచనీయమని పేర్కొంది. ఆ వైఖరి మార్చుకోకపోతే చంద్రబాబు వెన్నువిరుగుతుందని హెచ్చరించింది. రచయిత కంచ ఐలయ్య అధ్యక్షతన   సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ విజయవాడలో జరుపబోతున్న సామాజిక సంఘీభావ కమిటీ సభ ఐలయ్య పుస్తకాన్ని ఉద్దేశించినదికాదన్నారు. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ల డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సభ అన్నారు. కంచ ఐలయ్య మాట్లాడుతూ తనను ఉరి తీయాలని ఫత్వా జారీచేసి ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ సమస్యని అంతర్జాతీయం చేశారన్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు రక్షణ లేని చోట పెట్టుబడులుపెట్టేందుకూ ఎవ్వరూ ముందుకు రారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు.

విజయవాడలో సభ జరిపేతీరుతామని తేల్చి చెప్పారు. ఏపీలోనే అంబానీకి అతిపెద్ద ఆయిల్‌సోర్స్‌ ఉందని, నిరుద్యోగులకు, మృత్యువాత పడుతున్న రైతులకు అంబానీ ఏం చేస్తున్నారో బాబు సమాధానం చెప్పాలని ఐలయ్య నిలదీశారు?  సామాజిక బాధ్యతను నిర్వర్తించని అంబానీ గ్రూపులకు రాయితీలిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. సభకు అనుమతినిచ్చి మరోపక్క సభ జరగనివ్వం, ఐలయ్య వస్తే దాడి చేస్తామని ఏపీ ప్రభుత్వమే ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలతో చెప్పిస్తోందని బీసీ సంఘాల సమన్వయకమిటీ నాయకులు సాంబశివరావు విమర్శించారు. ఈ ప్రకటన చేసింది టీడీపీకి చెందిన సిరిపురం శ్రీధర్‌శర్మేనని తేల్చిచెప్పారు. బాబు ఆదేశాల మేరకే సభని అడ్డుకుంటున్నారని కులవివక్ష పోరాట సమితి నేత జాన్‌వెస్లీ చెప్పారు. చంద్రబాబు, టీజీ వెంకటేశ్‌ ఇదే వైఖరి కొనసాగిస్తే ఏపీలో సైతం టీడీపీకి పుట్టగతులుండవ న్నారు. సుప్రీంకోర్టు పుస్తకంపై స్పష్టత ఇచ్చినా ఐలయ్యను అడ్డుకోవడం కం టెంట్‌ ఆఫ్‌ కోర్టు అవుతుందని ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావు అన్నారు. ఏఈపీ బీసీ సంఘం నేతలు రామకృష్ణ, మాష్టార్జీ, శ్రీరాములు నాయక్‌  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు