కారెక్కాలా.. చేయందుకోవాలా..?

1 Nov, 2017 13:21 IST|Sakshi

తర్జనభర్జనలో నల్లగొండ జిల్లా నేత కంచర్ల భూపాల్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి మాటకోసం ఎదురుచూపు

మరోవైపు టీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానం

కాంగ్రెస్‌లో చేరిన బీల్యా, రమేశ్‌రెడ్డి

సాక్షిప్రతినిధి, నల్లగొండ :  ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరితే.. మరోనేత తర్జనభర్జనలో ఉన్నారు. తన చేరికపై కాంగ్రెస్‌ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం, టీఆర్‌ఎస్‌ నుంచి ఆహ్వానం రావడంతో ఎటువెళ్లాలో తేల్చుకోలేక సందిగ్ధంలో మునిగారు. బీల్యానాయక్, పటేల్‌ రమేశ్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో రేవంత్‌రెడ్డితో పాటు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇక మిగిలింది..కంచర్ల భూపాల్‌రెడ్డి ఎటు అడుగులు వేస్తారని రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ నుంచి వచ్చే హామీతో రేవంత్‌రెడ్డితో ఢిల్లీ వెళ్లాలని భావించిన కంచర్ల చివరకు వెనక్కు తగ్గారు. స్థానికంగా టికెట్‌ విషయంలో నమ్మకం లేకపోవడం, రేవంత్‌ కూడా రెండు, మూడు రోజులు వేచి చూడాలని చెప్పడంతో ఆయన చేరికను వాయిదా వేసుకున్నారు.

 రేవంత్‌తో సమావేశానికి వెళ్లకముందే కంచర్లకు టీఆర్‌ఎస్‌ నుంచి పిలుపురావడంతో.. ‘ఏం చేద్దామని’ ఆయన కుటుంబ సభ్యులతో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి వెళ్లి వచ్చిన ఆయనతో టీఆర్‌ఎస్‌ నేతలు పార్టీలో చేరిక విషయమై మరోమారు చర్చించినట్లు తెలిసింది. రేవంత్‌పై ఉన్న వ్యక్తిగత అభిమానం, కాంగ్రెస్‌లో టికెట్‌పై స్పష్టమైన హామీ లేని పరిస్థితుల్లో ఎటు వెళ్దామని అనుచరులతో మంగళవారం నల్లగొండలోని తన నివాసంలో చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఓ ఎమ్మెల్యే కంచర్ల చేరిక విషయంలో మంత్రి ఆదేశాలతో ముందుకు కదిలినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే కాంగ్రెస్‌లో టికెట్‌ ఇస్తామని హామీ ఇస్తేనే ఆపార్టీలో చేరాలని.. లేకపోతే టీఆర్‌ఎస్‌ వైపు చూడాలని సన్నిహితులు  కంచర్లకు సూచించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నుంచి ఇప్పట్లో హామీ ఇచ్చేది సాధ్యం కాకపోవడంతో.. ఏకంగా సీఎం ఇచ్చే హామీతో టీఆ ర్‌ఎస్‌లో చేరాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోం ది. టీఆర్‌ఎస్‌లో కంచర్ల చేరికపై ఆపార్టీలోని మరోవర్గం ఆయన్ను వ్య తిరేకిస్తోంది. ఏదిఏమైనా ఢిల్లీ నుంచి రేవంత్‌ వచ్చిన తర్వాత ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో కంచర్ల ఉన్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు