టీజేఏసీ చైర్మన్‌గా కంచర్ల రఘు

14 May, 2018 01:24 IST|Sakshi
మాట్లాడుతున్న కోదండరామ్‌. చిత్రంలో రఘు

కన్వీనర్‌గా పురుషోత్తం... 

టీజేఏసీ విస్తృత స్థాయి భేటీలో ఎన్నిక 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ (టీజేఏసీ) నూతన చైర్మన్‌గా కంచర్ల రఘు, కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ పురుషోత్తం ఎన్నికయ్యారు. నగరంలో ఆదివారం జరిగిన టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు జేఏసీ కన్వీనర్‌గా రఘు, కో–చైర్మన్‌గా పురు షోత్తం ఉన్నారు. అంతకుముందు ప్రొఫెసర్‌ కోదండరామ్, ఇతర కార్యవర్గ సభ్యుల రాజీనామాలను సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా పలువురు టీజేఏసీ నేతలు, తెలంగాణ జన సమితి నాయకులు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో టీజేఏసీ పాత్ర కీలకమైందని అభివర్ణించారు. 

రాజకీయాల్లో మార్పు కోసమే వైదొలిగాను 
రాజకీయాల్లో మార్పు కోసమే తాను టీజేఏసీ నుంచి వైదొలిగానని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ పేర్కొన్నారు. జేఏసీ బలోపేతం కావాలని, బలమైన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. జేఏసీని వీడుతున్నందుకు బాధగా ఉందని, అయితే ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తప్పడం లేదన్నారు. రాష్ట్ర సాధనలో టీజేఏసీ పాత్ర మరువలేనిదన్నారు. టీజేఏసీ నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు సంఘటితంగా ఉద్యమం చేశారన్నారు. సమష్టి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పని చేయాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అందుకోసం టీజేఏసీ కృషి చేయాలన్నారు. అనుకున్నంత ఈజీగా రాజకీయాలు మారవని, పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ మనం అనుకున్నది కచ్చితంగా ప్రజలకు చెప్పాలన్నారు.  

కోదండరామ్‌ లేని జేఏసీని ఊహించలేము 
తెలంగాణ సమాజానికే కోదండరామ్‌ ఒక ప్రతీక అని, ఆయన లేని జేఏసీని ఊహించలేమని జేఏసీ చైర్మన్‌ రఘు పేర్కొన్నారు. రకరకాల వ్యక్తిత్వాలను ఒక వేదికపైకి తీసుకురావడంతోపాటు ఎంతో ఓపిక, సహనంతో పని చేశారన్నారు. త్వరలోనే టీజేఏసీ సమావేశం ఏర్పాటు చేసి, స్టీరింగ్‌ కమిటీ ప్రకటనతోపాటు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. జేఏసీ కన్వీనర్‌గా తనను ఎన్నుకున్నందుకు ప్రొఫెసర్‌ పురుషోత్తం ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు