‘కంది’ పోతోంది..

8 Nov, 2018 15:03 IST|Sakshi

కంది పంటల్లో లోపించిన ఎదుగుదల

పూత దశలోనే పురుగు బెడద ఆందోళనలో అన్నదాతలు 

సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్‌): ఆరుగాలం కష్టించి పంటలు పండించే అన్నదాతలను ప్రతికూల వాతావరణ పరిస్థితులు కుంగదీస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో పంటల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతన్నలు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. విత్తనం నాటిన నుంచి పంట చేతికి అందే వరకు దేవుడిపై భారం వేస్తున్నారు. ఈసారి ఖరీఫ్‌ ప్రారంభం నుంచే వర్షాలు అధికంగా కురవటంతో పంటల్లో ఎదుగుదల లేక నష్టపోగా ఖరీఫ్‌ చివరి కాలంలో వర్షాలు పూర్తిగా ముఖం చాటేయటంతో పంటలు ఆశాజనకంగా లేవు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పత్తిలో దిగుబడి తగ్గి దెబ్బతీయగా కందిపై పెట్టుకున్న ఆశలు సైతం సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కంది పంట పూత దశలో ఉండగా వర్షాలు లేక ఎదుగుదల పూర్తిగా మందగించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది.

దెబ్బతీసిన అధిక వర్షాలు
ఖరీఫ్‌ ప్రారంభంలో జిల్లాలో కురిసిన అధిక వర్షాలు పత్తితోపాటు కంది పంటలను సైతం తీవ్రంగా దెబ్బతీశాయి. భూమిలో తేమశాతం అధికంగా మారటంతో పంటల్లో ఎదుగుదల పూర్తిగా లోపించింది. దాని ప్రభావం ఇప్పటికే పత్తి పంటలపై చూపగా ప్రస్తుతం కందిపై ప్రభావం పడింది. ప్రారంభంలో అధిక వర్షాలతో పంటల్లో పెరుగుదల లోపించగా ఖరీఫ్‌ చివరి కాలం నాటికి వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి. దాంతో పంటలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలను ప్రతికూల వాతావరణ పరిస్థితులు అడియాసలు చేశాయి. జిల్లా వ్యాప్తంగా ఈసారి ఖరీఫ్‌లో 12,495 హెక్టార్లలో రైతులు కంది పంటలను సాగు చేశారు. చాలా మంది రైతులు అధిక శాతం పత్తికి అంతర పంటలుగా కందిని సాగు చేయగా మిగిలిన వారు నేరుగా సాగు చేశారు. ప్రస్తుతం కంది పంటలన్ని పూతదశకు చేరుకోగా పంటల్లో పెరుగుదల లేకపోవటంతో కనీసం పెట్టుబడి సైతం దక్కేలా కనిపించటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఈసారి సుమారు 1,56,188 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి సగానికి సగం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు బావిస్తున్నారు. పంటల్లో పెరుగుదల లేక ఆశించిన స్థాయిలో పూత కనిపించటం లేదు.

ముందుంది తెగుళ్ల కాలం..
జిల్లాలో ఇప్పుడిప్పుడే పూత పడుతున్న కంది పంటను పచ్చపురుగు, లద్దెపురుగు, మచ్చల పురుగు ఉధృతంగా ఆశిస్తుండడం రైతులను కలవర పెడుతోంది. పూత దశలోనే పురుగు ఉధృతి అధికంగా మారటంతో రైతులను ఇబ్బందులను గురిచేస్తోంది. దానికి తోడూ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంటలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. దాంతో కందికి పూతలు సరిగా రాకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వాతావరణం మబ్బు పడితే కందిపై పురుగుల బెడద మరింత అధికమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, పిందె రాలిపోయి మరింత నష్టపోవాల్సి వస్తుంది. ఆ దశలో వాతావరణం అనుకూలిస్తే తప్పా కనీసం పెట్టుబడులు సైతం రాబట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారుల నుంచి సలహాలు, సూచనలు అందకపోవటంతో రైతులు తమకు తోచిన మందులు పిచికారి చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.  

జిల్లాలో కంది సాగు

మండలం  హెక్టార్లు
సిర్పూర్‌(యు) 1,179
జైనూర్‌ 739
కెరమెరి  1,606
లింగాపూర్‌    691
ఆసిఫాబాద్‌ 1,310
రెబ్బెన  480
వాంకిడి    1,198
తిర్యాణి      1,208
కాగజ్‌నగర్‌ 742
సిర్పూర్‌(టి)  894
కౌటాల 830
బెజ్జూర్‌    462
దహెగాం  161
చింతలమానెపల్లి 722
పెంచికల్‌పేట్‌    273
మొత్తం   12,495 

మరిన్ని వార్తలు