కంది.. దిగజారింది

20 Sep, 2018 08:01 IST|Sakshi

ఖమ్మంవ్యవసాయం: రైతులు కంది సాగుకు దూరమవుతున్నారు. సాగు ఖర్చులు పెరిగిపోవడం, పండిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో ఏడాదికేడాది సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. రైతులు వర్షాధారంగా మెట్ట భూముల్లో, మిశ్రమ పంటగా కూడా పంటను అధికంగా సాగు చేస్తుంటారు. ఖరీఫ్‌ సీజన్‌లో తొలకరి సమయంలోనే పంట వేస్తారు. సాగుకు ఎకరాకు రూ.15వేలు ఖర్చవుతుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 5 క్వింటాళ్లు ఆపైన దిగుబడి వస్తుంది.

వర్షాలు అనుకూలించకపోవడంతో రెండు, మూడేళ్లుగా ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లకు మించి దిగుబడులు రావడం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలతో పండిన పంట ఉత్పత్తికి కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. పంట సాగుతో నష్టపోతున్నామని, ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర కూడా ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల కాలం ఉండే పంట కాలంలో ఎక్కువగా శ్రమించినా ఫలితం ఉండడం లేదని రైతులు పేర్కొంటున్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో కంది సాగు పరిస్థితి చూస్తే పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది.

గిట్టుబాటు ధర లేకపోవడమే.. 
కంది పంటకు ఆశించిన ధరను కేంద్రం ప్రకటించడం లేదు. పంట కాలపరిమితి, సాగుకయ్యే ఖర్చు తదితరాలను పరిగణనలోకి తీసుకొని మద్దతు ధర నిర్ణయిస్తే రైతులు సాగుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. 2015లో పత్తి పంటను విదేశాలకు ఎగుమతి చేయడంలో అవరోధాలు ఉన్నాయని, దేశంలో పప్పు దినుసుల పంట సాగు బాగా తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం.. పత్తి సాగును తగ్గించి.. పప్పు దినుసుల పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

దీంతో పప్పు దినుసుల పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా విస్తృత ప్రచారం చేసింది. రైతు చైతన్య యాత్రలో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేశారు. సాగు పెంచాలని చెప్పారే తప్ప గిట్టుబాటు ధరపై స్పందించ లేదు. గత ఏడాది ఈ పంటకు కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.5,450, ఈ ఏడాది రూ.5,675 ప్రకటించింది. ఈ ధరలు వచ్చే దిగుబడులకు ఎంత మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఇదిలా ఉండగా.. ప్రైవేటు వ్యాపారులు రూ.3వేల నుంచి రూ.3,500 మించి ధర పెట్టడం లేదు. ప్రభుత్వం నాఫెడ్, మార్క్‌ఫెడ్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా.. రైతులకు ఇవి ఎంతమాత్రం ఉపయోగపడడం లేదు. నాణ్యత నిబంధనల పేరిట రైతు పంటను తిరస్కరిస్తున్నారు. ఎకరాకు రూ.15వేల వరకు ఖర్చవుతుండగా.. పండిన పంట నుంచి రూ.10వేల ఆదాయం కూడా రావడం లేదు.  
అంతర పంటకు ఇష్టపడని రైతులు.. 
కందిని గతంలో పెసర, మినుము, మొక్కజొన్న, వేరుశనగ, పసుపు, పత్తిలో అంతర పంటగా సాగు చేసేవారు. వరి గట్లపై కూడా సాగు చేసేవారు.  ప్రస్తుతం అంతర పంటగా దీనికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పత్తి చేల చుట్టూ, గట్లపై కొందరు కంది పంటను సాగు చేస్తున్నారు. కొందరు మాత్రం వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పురుగు ఆశించకుండా 4, 5 పత్తి వరుసల్లో కందిని వేస్తున్నారే తప్ప మరే పంటలో దీనిని అంతర పంటగా సాగు చేయడం లేదు.

ధర లేకనే వేయట్లేదు.. 
కంది వేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. పెట్టుబడి కూడా రావడం లేదు. ధర మరీ దారుణంగా ఉంది. రెండేళ్లుగా ఆ పంటను వేయడం లేదు. ఎకరానికి రెండు క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్వింటాకు రూ.3వేల ధర కూడా పెట్టడం లేదు. ఆ పంట వేసి ఏమీ లాభం లేదు.  – సబాటు వీరన్న, గోవింద్రాల, కామేపల్లి మండలం 

రైతు పంటను కొనరు.. 
మార్కెట్‌కు అమ్మకానికి తెస్తే పంట నాణ్యత లేదని కొర్రీలు పెడతారు. ఇదే సరుకును ప్రైవేటు వ్యాపారికి చూపిస్తే నాణ్యత లేదంటూ రూ.3వేలకు మించి ధర పెట్టడం లేదు. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర కూడా రైతుకు గిట్టుబాటు కావడం లేదు. – బాదావత్‌ భద్రు, పంగిడి, ముదిగొండ మండలం 

మరిన్ని వార్తలు