కంది ‘మద్దతు’ దళారులకే..

9 Jan, 2017 03:59 IST|Sakshi
కంది ‘మద్దతు’ దళారులకే..

రైతుల నుంచి తక్కువకు కొని ఎంఎస్‌పీకి సర్కారుకు విక్రయం
సాక్షి, హైదరాబాద్‌: కందులకు ప్రభుత్వం ఇస్తున్న కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) రైతుల కు కాకుండా దళారులకే చేరుతోందన్న విమ ర్శలు వినవస్తున్నాయి. కందుల ధర మార్కె ట్లో పతనం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిం ది. గతేడాది కందుల ధర మార్కెట్లో క్వింటా లుకు రూ.10 వేల వరకు ఉండగా... ఈసారి ఏకంగా రూ. 4 వేలకు మించి పలకడం లేదు. అంటే రూ. 6 వేల వరకు ధర తగ్గింది. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత్యంతర లేక దళారులను, వ్యాపారులను ఆశ్రయించి అదే ధరకు విక్రయిస్తున్నారు. ఇలా తక్కువ ధరకు కొనుగోలు చేసిన కందులను దళారు లు మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నడిచే కొనుగోలు కేంద్రాల్లో ఎంఎస్‌పీకి విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. రైతుల పాసు పుస్తకాలు దగ్గర పెట్టుకొని కొందరు మార్క్‌ఫెడ్‌ అధికా రుల అండతో ఇలా చేస్తున్నట్లు తెలిసింది.

95 వేల టన్నులే సేకరణ...
రాష్ట్రవ్యాప్తంగా 5.15 లక్షల మెట్రిక్‌ టన్నుల కంది దిగుబడులు రావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఎఫ్‌సీఐ, నాఫెడ్‌ ద్వారా 50 వేల మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేస్తానని కేంద్రం ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలోని మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా కేవలం 45 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతిచ్చింది. కొనుగోలుకు పరిమితి తక్కువ ఉండటంతో దళారులు, వ్యాపారులే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.

క్వింటాల్‌ కందులకు కేంద్రం ఎంఎస్‌పీ రూ. 5,050కి ఖరారు చేసింది. రైతుల నుంచి రూ. 4 వేల వరకు కొనుగోలు చేసే వ్యాపారులు సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రూ. 5,050కు విక్రయిస్తున్నారు. దీంతో ఒక్కో క్వింటాలుకు ఏకంగా రూ. వెయ్యికి మించి లాభం పొందుతున్నారు. రైతు మాత్రం దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నాడు. 95 వేల మెట్రిక్‌ టన్నులే పరిమితి విధించడం వల్ల కొందరు అధికారులు.. దళారులకే మద్దతు పలుకు తున్నారన్న ఆరోపణలున్నాయి. మార్క్‌ఫెడ్‌ లెక్కల ప్రకారం ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 6,500 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేశారు. అందులో ఎక్కువ భాగం వ్యాపారుల నుంచే కొన్నారని తెలిసింది.

ముందు ప్రోత్సహించి... ఇప్పుడు గాలికొదిలేశారు
2015 ఖరీఫ్‌లో రాష్ట్రంలో కేవలం 5.62 లక్షల ఎకరాల్లోనే కంది సాగైంది. అప్పట్లో కరువు పరిస్థితులు కూడా కంది దిగుబడిని దెబ్బకొట్టాయి. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో కంది సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహించింది. ఈ ఏడాది తెలంగాణలో ఖరీఫ్‌లో కంది సాధారణ సాగు విస్తీర్ణం 6.44 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది ఏకంగా 10.30 లక్షల (168%) ఎకరాల్లో సాగైంది. రైతులను కందివైపు ప్రోత్సహించిన ప్రభుత్వం వారికి అవసరమైన ఎంఎస్‌పీ దక్కేలా పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. రైతులు పండించే కందులను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంది. పండే మొత్తం కందిని ఎంఎస్‌పీకి కొనుగోలు చేస్తే.. దళారులకు కళ్లెం వేయడమే కాకుండా రైతులు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు