కందికట్కూర్‌కు ‘లీకేజీ’ భయం

2 Dec, 2019 03:06 IST|Sakshi
కట్ట కింద పారుతున్న నీరు

‘మధ్యమానేరు’కు సీపేజీతో గ్రామస్తుల ఆందోళన

సాధారణ సీపేజీయని, ప్రమాదం లేదని అధికారుల వివరణ 

నాలుగు రోజుల్లో పూర్తిగా నీళ్లు

ఇల్లంతకుంట (మానకొండూర్‌): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామం వద్ద నిర్మించిన మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు నుంచి రెండు రోజులుగా నాలుగైదు చోట్ల నీటి ఊటలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆనకట్ట నుంచి నీరు లీకవడంతో తమకు ముప్పేమైనా ఉంటుందా? అని గ్రామస్తులు ఆందోళనలకు గురవుతున్నారు. గతంలో బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద బోగం ఒర్రె ప్రాం తంలో బుంగపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అక్కడి మాదిరిగానే ఇక్కడ బుంగ పడుతుందని భయపడుతున్నారు. 

కాగా, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌ సమీపంలో మధ్యమానేరు ఆనకట్ట నుంచి శనివారం మూడు చోట్ల ఊట లొచ్చాయి. దీంతో అధికారులు రాళ్లు, మట్టితో ఆ ప్రాంతాన్ని పూడ్చివేయించారు. ఆదివారం మళ్లీ రెండుచోట్ల ఊటలు రావడం ప్రారంభమైంది. ఇది చూసి గ్రామస్తులు ఆనకట్ట నుంచి వస్తున్న లీకేజీ ఊట ఎక్కడ ఉప్పెనగా మారుతుందోనని ఆందో ళన చెందుతున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఆనకట్ట వెంట నిర్మించిన కాల్వలో సీపేజీ నీళ్లు పారుతున్నాయి. నాలుగైదు చోట్ల కట్ట నుంచి నీళ్లు బయటికి వస్తున్నాయి. 

భయం అవసరం లేదు: శ్రీకాంత్‌రావు, ఎస్‌ఈ 
మధ్యమానేరు ఆనకట్ట నుంచి వస్తుంది సీపేజీ వాటర్‌ మాత్రమే. ఆనకట్టకు ప్రమాదం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అనుకున్న స్థాయిలో కూడా రావడం లేదు.  

కట్ట లీకేజీపై సీఎం పేషీ ఆరా  
మధ్యమానేరు ఆనకట్ట లీకేజీపై సీఎం పేషీ అధికారులు ఆదివారం ఆరా తీశారు. అధికారులకు ఫోన్‌ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు