జై కంగారూ..

3 Jan, 2020 11:53 IST|Sakshi

సత్ఫలితాలిస్తున్న ‘కేఎంసీ’ సర్వీసులు

నిలోఫర్‌లో రెండేళ్ల క్రితం 20 పడకలతో ప్రారంభం

ఇప్పటి దాకా 14 వేలకు పైగా బిడ్డలకు సేవలు

ఇంక్యుబేటర్‌ కంటే తల్లి పొత్తిళ్లే ఎంతో మేలు  

సాక్షి,సిటీబ్యూరో: నెలలు నిండకుండా.. తక్కువ బరువుతో జన్మించే శిశువుల కోసం నిలోఫర్‌ ఆస్పత్రిలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ‘కంగారూ మదర్‌ కేర్‌’ (కేఎంసీ) సర్వీసులు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇంక్యుబేటర్‌ సపోర్ట్‌ సహా పైసా ఖర్చు లేకుండా స్వయంగా తల్లే తన బిడ్డను కాపాడుకునేఅవకాశం ఉండడంతో ఈ సేవలకు డిమాండ్‌ బాగా పెరిగింది. శిశు మరణాల రేటును 40 శాతం తగ్గించడమే కాకుండా 55 శాతం ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల శిశువులు నెలలు నిండకుండా తక్కువ బరువుతో జన్మిస్తుండగా, మనదేశంలో 8 మిలియన్ల మంది పుడుతున్నారు. వీరిలో 60 శాతం మందికి ‘కంగారూ మదర్‌ కేర్‌’ సర్వీసులు అవసరం అవుతుంటాయి.  ప్రతిష్ఠాత్మాక నిలోఫర్‌ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో రోజుకు సగటున 20 నుంచి 25 ప్రసవాలు జరుగుతుంటే, వీటిలో ఆరు నుంచి ఏడుగురు శిశువులకు ‘కేఎంసీ’ సర్వీసులు అవసరమవుతున్నాయి. ఇంక్యుబేటర్‌ విధానం ఖర్చుతో కూడుకున్నది కాగా.. ‘కేఎంసీ’లో ఎలాంటి ఖర్చు ఉండదు. దీంతో నిరుపేద తల్లులు తమ బిడ్డలను సంరక్షించుకునేందుకు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. తల్లీ,బిడ్డల మధ్య ఆత్మీయ స్పర్శను పెంచుతుంది. ఆశించిన స్థాయిలో మానసిక, శారీరక ఎదుగుదల ఉండడంతో పాటు ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్‌ అయ్యేందుకు దోహదపడుతుంది. 

14 వేల మంది పిల్లలకు సేవలు
జాతీయ ఆరోగ్య మిషన్‌ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తొలుత నల్లగొండ జిల్లా, సిద్దిపేట ఆస్పత్రుల్లో ఈ సేవలను ప్రారంభించింది. తర్వాత 2017 నవంబర్‌లో నిలోఫర్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. 20 పడకల సామర్థ్యం ఉన్న ఈ ‘కంగారూ మదర్‌ కేర్‌’ యూనిట్‌లో రోజుకు సగటున 20 మంది శిశువులకు సేవలు అందిస్తున్నారు. ఇలా గత రెండేళ్లలో 14 వేలకు పైగా శిశువులకు సేవలను అందించారు. తల్లే తన బిడ్డను సంరక్షించుకునే అవకాశం ఉండడంతో కేవలం నిలోఫర్‌లో ప్రసవించిన తల్లిబిడ్డలకే కాకుండా ఇతర ఆస్పత్రుల్లో జన్మించి, కేఎంసీ సర్వీసులు అవసరమైన తక్కువ బరువుతో జన్మించిన(ఆరోగ్యం నిలకడగా ఉన్న) శిశువులకు రోజుకు సగటున నాలుగు నుంచి 12 గంటల పాటు ఈ కేఎంసీ సేవలు అందిస్తున్నారు.  

‘‘సాధారణంగా నెలలు నిండకుండా తక్కువ బరువుతో పుట్టిన శిశువు శరీర ఉష్ణోగ్రతను కాపాడేందుకు వైద్యులు కొన్ని రోజుల పాటు ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. ఇందులో తల్లి ఓ చోట.. బడ్డ మరోచోట ఉంటారు. అయితే, ‘కంగారూ మదర్‌ కేర్‌’లో అలాంటి బిడ్డను ఓ గుడ్డలో చుట్టి తల్లి ఛాతిపైనే పడుకోబెడతారు. దీని ద్వారా తల్లి శరీర ఉష్ణోగ్రత బిడ్డకు అందడంతో తల్లి పాలు తాగేందుకు వీలుంటుంది. ఫలితంగా బిడ్డ త్వరగా బరువు పెరిగి వేగంగా కోలుకోడడంతో పాటు ఆరోగ్యవంతంగా తయారవుతుంది. పైగా ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందడదు. తల్లి ఛాతిపై బిడ్డ పడుకోవడంతో ఆమె గుండె చప్పుడు, పల్స్‌ను వినడం ద్వారా బిడ్డలో వినికిడి శక్తి పెరుగుతుంది. వాస్తవానికి పుట్టిన బిడ్డకు మీటర్‌ దూరం దాటిన వస్తువులను, మనుషులను చూడలేదు. కానీ ‘కంగారూ మదర్‌ కేర్‌’ ద్వారా తల్లిని తరచూ చూడ్డంతో చూపు కూడా వేగంగా మెరుగుపడుతుంది.’’    

కేఎంసీతో ఎన్నో లాభాలు..
2.5 కేజీల కంటే తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు ‘కంగారూ మదర్‌ కేర్‌’ను సూచిస్తారు. స్కిన్‌ టచ్‌ వల్ల తల్లీబిడ్డల మధ్య ఆప్యాయత, అనురాగాలు మెరుగుపడుతాయి. ఆకలితో బిడ్డ ఏడ్చినప్పుడల్లా పాలను పడుతుండడం వల్ల బ్రెస్ట్‌ ఫీడింగ్‌ మెరుగుపడుతుంది. తల్లిపాలలోని బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతోంది. తక్కువ బరువుతో జన్మించిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువ. త్వరగా జబ్బుల బారినపడే ప్రమాదం ఉంది. బిడ్డ శ్వాస నాళాల పనితీరు మెరుగుపడడంతో పాటు భవిష్యత్‌లో శ్వాస సంబంధ సమస్యలు దరిచేరే అవకాశం ఉండదు.– డాక్టర్‌ రమేష్, ఆర్‌ఎంఓ, నిలోఫర్‌

మరిన్ని వార్తలు