మన పథకాలు దేశానికే ఆదర్శం

16 Aug, 2018 15:24 IST|Sakshi
కంటి పరీక్షలు చేయించుకుంటున్న కడియం 

హన్మకొండ అర్బన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘కంటివెలుగు’ కార్యక్రమాన్ని బుధవారం పట్టణంలోని రెడ్‌క్రాస్‌ ఆవరణలో కడియం ప్రారంభించారు.  అనంతరం ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ  రాష్ట్రంలో 3.50కోట్ల మందికి కంటిపరీక్షలు చేసి అవసరమైన అద్దాలు, మందులు అందించే ‘కంటివెలుగు’ కార్యక్రమం గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదిస్తుందని  ధీమా వ్యక్తం చేశారు.   రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటిపరీక్షలు చేసేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేలు ఆర్థిక సాయం చేస్తోందని.. ఈ  పథకం ద్వారా ఈ రోజు జిల్లాలో 50మంది యువతకు చెక్కులు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కంటి సమస్యలు అంధత్వంగా మారకూడదనే ఉద్దేశంతో ‘కంటివెలుగు’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా నగరంలో 13క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు కంటి పరీక్షలు చేయించడం జరగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ జిల్లాలో ‘కంటి వెలుగు’ను సమర్ధవంతంగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, మహిళా సంఘాల సహకారం తీసుకుంటున్నామని, మొత్తం 500మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు.

పరీక్షల అనంతరం అందించేందుకు 1.26లక్షల కళ్ల అద్దాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. శస్త్ర చికిత్సలు అవసరం ఉన్నవారికి నగరంలో ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నిర్ణీత తేదీల్లో చేస్తారని తెలిపారు. ప్రతి సోమవారం పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారం అధికారికంగా విడుదల చేస్తామన్నారు. నగరంలో రోజుకు 300మందికి, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 250మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.  కార్యక్రమంలో పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దల పద్మ, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విముక్త కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ హరీష్‌రాజ్, ఎంపీలు బండాప్రకాష్, పసునూరి దయాకర్, కార్పొరేటర్‌ కేశబోయిన అరుణ, ఐఎంఏ ఛైర్మన్‌ డాక్టర్‌ సుదీప్, రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ విజయ్‌చందర్‌రెడ్డి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు