‘చీకట్లు’  తొలగేనా..? 

23 Aug, 2019 10:01 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమం మసకబారుతోంది. శస్త్ర చికిత్స చేస్తే మసక చీకట్లు తొలగి కంటిచూపు మెరుగు పడుతుందని ఆశించిన వారికి ఆ చూపేమో కానీ.. ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు. కంటివెలుగు పరీక్షలు చేయించుకుని ఆపరేషన్‌ల కోసం ఆరు నెలలుగా వేలాది మంది వేచి చూస్తున్నారు. ప్రభుత్వం తమపై ఎప్పుడు కరుణ చూపుతుందో.. తమ జీవితాల్లో చీకట్లు ఎప్పుడు తొలగిపోతాయో అని వారు నిరీక్షిస్తున్నారు.

సాక్షి, ఖమ్మం(బూర్గంపాడు) : రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అగస్టులో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జిల్లాలోని అన్ని గ్రామాలలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స నిర్వహించారు. దృష్టి లోపం ఉన్నవారికి పరీక్షలు జరిపారు. రీడింగ్‌ గ్లాస్‌లు, మందులు అవసరమైన వారికి వెంటనే అందించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లజోళ్లు కావల్సిన వారికి కూడా ఐదు నెలల తర్వాత పంపిణీ చేశారు. శస్త్ర చికిత్సలు అవరసమైన వారిని గుర్తించి రిఫరల్‌ ఆస్పత్రులకు పంపేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అయితే కంటివెలుగు శిబిరాలు పూర్తయి ఆరు నెలలు కావస్తున్నా.. ఆపరేషన్‌లు అవసరమైన వారికి మాత్రం ఇప్పటి వరకూ చేయలేదు. దీంతో పేర్లు నమోదు చేసుకున్న వారు తమకు శస్త్ర చికిత్సలు ఎప్పుడు చేస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.  

4.93 లక్షల మందికి కంటి పరీక్షలు... 
జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం కింద 4.93 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1.20 లక్షల మందికి కళ్లద్దాలు, మందులు అందించారు. మరో 45 వేల మందికి ప్రత్యేకంగా కళ్లజోళ్లు తయారు చేయించి పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 వేల మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. వారి పేర్లు, ఎదుర్కొంటున్న సమస్యల వివరాలను ఆన్‌లైన్‌ చేశారు. ఏ ఆస్పత్రిలో ఎవరికి ఆపరేషన్లు చేయాలనే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఈ తంతు పూర్తయి ఆరు నెలలు గడిచింది. కానీ ఇప్పటివరకు ఆపరేషన్లు మాత్రం ప్రారంభించలేదు. వైద్యాధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో 23 వేల మంది కంటివెలుగు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ఆపరేషన్లు చేయించాలని వారు కోరుతున్నారు.  

ఆపరేషన్‌లు చేయటం లేదు 
కంటివెలుగు శిబిరంలో పరీక్షలు చేసి ఆపరేషన్‌ చేయాలన్నారు. ఇప్పటికి ఆరునెలలైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. మాకు కళ్లజోళ్లు కూడా ఇవ్వలేదు. ఆపరేషన్‌ చేస్తారని ఎదురు చూస్తున్నాం.
– పుట్టి లక్ష్మి, గౌతమిపురం 

ప్రైవేటు ఆస్పత్రులకు పోతున్నారు 
కంటివెలుగులో ఆపరేషన్‌ చేయకపోవటంతో కొంతమంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి  చేయించుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే కంటివెలుగులో ఆపరేషన్లు చేయాలి. లేకపోతే ఆ కార్యక్రమానికి అర్థమే లేదు. స్వచ్ఛంద సంస్థల వారు కూడా క్యాంపులు పెట్టి కళ్లజోళ్లు ఇస్తున్నారు. 
– ఎడారి అచ్చారావు, బూర్గంపాడు 

ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు 
జిల్లాలో 23 వేల మందికి కంటి శస్త్ర చికిత్సలకు రికమండ్‌ చేశాం. వారి పేర్లు, చేయాల్సిన ఆపరేషన్‌ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. రిఫరల్‌ ఆస్పత్రుల వివరాలను కూడా ఆన్‌లైన్‌ చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. 
– డాక్టర్‌ భావ్‌సింగ్,  కంటివెలుగు జిల్లా ఇన్‌చార్జ్‌ 

మరిన్ని వార్తలు