లక్ష మందికి కంటి పరీక్షలు

16 Aug, 2018 03:24 IST|Sakshi

అట్టహాసంగా ‘కంటి వెలుగు’ప్రారంభం

వేలాది మందికి కళ్లజోళ్ల పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ‘కంటి వెలుగు’కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు దాదాపు లక్ష మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వేలాది మందికి కళ్లజోళ్లు ఇచ్చారు. కొందరికి మాత్రలు ఇవ్వగా, మరికొందరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. కంటివెలుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 824 శిబిరాల్లో ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో 561, పట్టణ ప్రాంతాల్లో 109, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 158 శిబిరాలు ప్రారంభమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి వరకు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో ‘కంటి వెలుగు’పథకాన్ని తొలుత లాంఛనంగా ప్రారంభించారు.

కొంతమందికి కళ్లద్దాలను అందజేశారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా మరికల్‌లో కంటి శిబిరాన్ని ప్రారంభించారు. కళ్లజోళ్లు, మందులు ఉచితంగా అందజేశారు. కంటిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో అనేకమంది వృద్ధులు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకోవడంతో పండగ వాతావరణం నెలకొందని మంత్రి లక్ష్మారెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’తో అన్నారు. మొదటిరోజు కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైందని, ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుందని వారు వివరించారు.  

మరిన్ని వార్తలు