‘తెలంగాణ కంటి వెలుగు’లు

4 Apr, 2018 02:17 IST|Sakshi

కంటి సమస్యలు లేని తెలంగాణే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త కార్యక్రమం 

సాక్షి, హైదరాబాద్‌ : కంటి చూపు సమస్యలు లేని తెలంగాణే లక్ష్యంగా సరికొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందించేందుకుగాను ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమం చేపడుతోంది. కార్యక్రమం అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ పంపింది. కళ్లద్దాల కొనుగోలు, పరీక్షలు చేసేందుకు పరికరాలు, తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ, పరీక్ష కేంద్రాల కోసం రూ.100 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే కార్యక్రమం మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్‌ మూడో వారంలోనే కార్యక్రమం ప్రారంభించాలనుకున్నా ‘రైతు బంధు’చెక్కుల పంపిణీ నేపథ్యంలో మే మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 

3.5 కోట్ల మంది కోసం ఏర్పాట్లు 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో 15 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల వయస్సు వారికి ఆర్‌బీఎస్‌కే కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తుండటంతో వారు మినహా రాష్ట్రంలోని 3.5 కోట్ల మందికి పరీక్షల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గ్రామాల వారీ షె డ్యూల్‌ను వైద్య, ఆరోగ్య శాఖ ఖరారు చేస్తోంది. రోగులకు ఇచ్చే మందులు, దృష్టి లోపాలున్న వారి కోసం 40 లక్షల కళ్లద్దాలు కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ కళ్లద్దాల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. దేశంలో భారీ సంఖ్యలో కళ్లద్దాలు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఫ్రాన్స్, చైనా వంటి దేశాల్లోనే ఉత్పత్తి ఎక్కువగా ఉంది. టెండర్లలో ఎంపికయ్యే కంపెనీలు తక్కువ సమయంలో కళ్లద్దాలు సరఫరా చేసేలా నిబంధనలు రూపొందించారు. 

బాధ్యతల పంపిణీ
కంటి పరీక్షల నిర్వహణ పూర్తిగా మెడికల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ చూసుకుంటారు. అవసరమైన వారికి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తారు. రోగుల వివరాల నమోదు సహా అవసరమైన ఏర్పాట్లు సమకూర్చుతారు. వివరాల నమోదులో మెడికల్‌ ఆఫీసర్, నేత్ర వైద్య నిపుణుడికి ఏఎన్‌ఎం (ఎంపీహెచ్‌ఏ) సహాయం చేస్తారు. రక్త, మూత్ర పరీక్షలకు నమూనాలు సేకరిస్తారు. ఫార్మసిస్టు పరీక్షల నివేదికల ఆధారంగా మందులు, కళ్లద్దాలను వైద్య నిపుణులు రోగులకు ఇస్తారు. కంటి పరీక్షల శిబిరానికి గ్రామ ప్రజలను తీసుకొచ్చేలా ఆశా కార్యకర్తలు పని చేస్తారు.  

స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లలో.. 
కంటి పరీక్షల నిర్వహణకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మెడికల్‌ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, నేత్ర వైద్య నిపుణుడు, ఫార్మసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్, ఏఎన్‌ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆశా కార్యకర్తలతో బృందాలు ఏర్పాటు చేస్తోంది. నేత్ర వైద్య నిపుణులు, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ కార్యక్రమ లక్ష్యాలు, ఉద్దేశాలు వివరిస్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో స్కూళ్లు, కమ్యూనిటీ భవనాల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు ఎక్కడ నిర్వహించాలో మండల స్థాయి అధికారులు నిర్ణయించనున్నారు. 

43 శాతం శుక్లాల వల్లే.. 
మారుతున్న జీవన శైలి, పౌష్టికాహారలోపాలే దృష్టి లోపాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దశాబ్దం క్రితంతో పోల్చితే కంటి చూపు సమస్యలున్న రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వయస్సు వారికి శుక్లాలు (పొర), చిన్న పిల్లల్లో పోషకాహార లోపం వల్ల దృష్టి లోపం ఏర్పడుతున్నాయి. కంటి చూపు కోల్పోయిన వారిలో 43 శాతం మంది శుక్లాల వల్లే చూపు కోల్పోయారని నిర్ధారించారు. రాష్ట్రంలోని 7 శాతం జనాభా మధుమేహం కారణంగా కంటిచూపు సమస్య (డయాబెటిక్‌ రెటీనోపతి)తో బాధపడుతున్నారు. వీటితోపాటు మరో 7 శాతం మంది నీటి కాసులు (గ్లకోమా)తో బాధపడుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో గ్లకోమా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  
రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్నవారు 

శుక్లాలు                      43 శాతం 
నీటి కాసులు                   7 శాతం 
డయాబెటిక్‌ రెటీనోపతి        7 శాతం 
బాల్యంలో అంధత్వం          4 శాతం 
నెలలు నిండని శిశువులకు సమస్యలు        4 శాతం 
చూపు మందగించడం        3 శాతం

మరిన్ని వార్తలు