‘వెలుగు’తోంది..!

19 Sep, 2018 07:29 IST|Sakshi

ఖమ్మం వైద్యవిభాగం:  కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంపై ముందస్తుగా విస్తృత ప్రచారం చేయడంతో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు శరవేగంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా.. వయసు నిమిత్తం లేకుండా కంటి పరీక్షలు చేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విదితమే. ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. కంటి పరీక్షలు చేయడంతోపాటు సమస్య ఉన్న వారికి మందులతోపాటు కళ్లద్దాలు అవసరం ఉన్న వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శస్త్ర చికిత్సలు అవసరం అనుకుంటే నిర్దేశించిన ఆస్పత్రుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

32 బృందాల పర్యవేక్షణలో.. 
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 32 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 36 బృందాలు అవసరముంటాయని అంచనాకు రాగా.. 32 వైద్య బృందాల ద్వారా వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరో నాలుగు బృందాలను అత్యవసరం మేరకు అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా సమస్య ఏర్పడినట్లయితే అత్యవసర బృందాలను వినియోగిస్తున్నారు. కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు పర్యవేక్షణలో వైద్య శిబిరాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 14,39,000 జనాభా ఉండగా.. నగరంలో 3,20,000 మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళిక లు తయారు చేసి.. ఆ దిశగా శిబిరాలు నిర్వహిస్తున్నారు.

నెల రోజుల్లో 1,08,692 మందికి పరీక్షలు 
జిల్లావ్యాప్తంగా కంటి పరీక్షలు శరవేగంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమం ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో 1,08,692 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 47,520 మంది పురుషులు కాగా.. 61,162 మంది మహిళలు ఉన్నారు. 10 మంది ట్రాన్స్‌జెండర్స్‌ పరీక్ష చేయించుకున్న వారిలో ఉన్నారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాలుగా విడదీశారు. 25 బృందాలు గ్రామీణ ప్రాంతంల్లో ప్రతి రోజూ పరీక్షలు చేస్తున్నారు. 7 బృందాలు నగరంలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో 447 గ్రామాలు ఉండగా.. ఇప్పటివరకు 108 గ్రామాల్లో పరీక్షలు పూర్తయ్యాయి. అలాగే నగరంలో 50 డివిజన్లు ఉండగా.. ప్రస్తుతం 9 డివిజన్లలో పరీక్షలు పూర్తి చేశారు. వారంలో 5 రోజులపాటు శిబిరాలు నిర్వహిస్తుండగా.. రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో బృందం 250, పట్టణ ప్రాంతంలో 350 మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. పథకం ప్రారంభంలో కొంతమేర మందకొడిగా సాగినా.. ప్రస్తుతం కంటి పరీక్షలు ఊపందుకున్నాయి.

27,580 మందికి కళ్లద్దాల పంపిణీ 
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 27,580 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కంటి సమస్యతో బాధపడుతూ.. కళ్లద్దాలు అవసరం ఉన్న వారికి మాత్రమే డాక్టర్లు కళ్లద్దాలు రాస్తున్నారు. మరో 28,223 మందికి కళ్లద్దాలు ఇవ్వాలని డాక్టర్లు రాయగా.. వారికి హైదరాబాద్‌ నుంచి రావాల్సి ఉంది. జిల్లాకు 1,60,000 కళ్లద్దాలు పంపించారు. అయితే కంటి సమస్య ఎక్కువ ఉన్న వారికి ప్రత్యేకంగా ఇండెంట్‌ పెట్టి తెప్పిస్తున్నారు. అయితే నెల రోజుల కాలంలో 13,047 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని గుర్తించారు. అందులో 9,626 మందిని ఖమ్మం, 3,421 మందిని హైదరాబాద్‌ ఆస్పత్రులకు ఆపరేషన్‌ కోసం పంపించారు. 

 ప్రతి ఒక్కరికీ పరీక్షలు 
శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తాం. శిబిరానికి వచ్చే వారు ఆధార్‌ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. జిల్లాలో కంటి పరీక్షలు ప్రస్తుతం  ఊపందుకున్నాయి. 32 వైద్య బృందాల ద్వారా ప్రతి రోజు 9వేల మందికి పైగా పరీక్షిస్తున్నాం. అత్యవసర బృందాలను కూడా వినియోగిస్తున్నాం. మందులు, కళ్లజోళ్లకు ఎలాంటి కొరత లేదు. నాలుగు నెలలకుపైగా శిబిరాలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరినీ పరీక్ష చేస్తాం. ప్రజలు శిబిరాలను సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలి. – కొండల్‌రావు, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు