కంటి వెలుగు ముమ్మరం

24 Sep, 2018 09:42 IST|Sakshi
కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

నల్లగొండ టౌన్‌ : ప్రజలను దృష్టి లోపం నుంచి గట్టెక్కించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నిరంతరాయంగా కొనసాగిస్తోంది. పండుగలు, సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లోనూ కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ శిబిరాలను జనవరి 26 వరకు కొనసాగించడానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పక్కా ప్రణాళికతోముం దుకు సాగుతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కో శిబిరంలో రోజూ 250 నుంచి 300 మంది వరకు కంటి పరీక్షలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు.

కంటి అద్దాల అందజేత..
కంటి పరీక్షలకు జిల్లా వ్యాస్తంగా 37 వైద్య బృందాలను ఏర్పాటు చేసి అందులో 37 మంది వైద్యాధికారులతో కలిసి ఒక్కో బృందంలో 12 మంది సిబ్బందిని నియమించారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని 57 గ్రామాలు, పట్టణాల్లోని 13 వార్డుల్లో ఇప్పటికే కంటి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పటి వరకు లక్షా 36 వేల 202 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. అందులో పురుషులు 59,553 మంది కాగా మహిళలు 76,634, థర్డ్‌జెండర్‌ 15 మంది ఉన్నారు. పరీక్షలు పూర్తయిన వారిలో ఎస్సీలు 25,941, ఎస్టీలు 11,213, బీసీలు 77,913, ఇతరులు 16,219, మైనార్టీలు 4,916 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 29,657 మంది రీడింగ్‌ కంటి అద్దాలను ఉచితంగా అందజేశారు. కంటి అద్దాలను అందించిన వారిలో నలబై సంవత్సరాల్లోపు వారు 5,709 మంది, నలబై సంవత్సరాలు దాటిన వారు 23,948 మంది ఉన్నారు. ఇతర కంటి అద్దాలను పంపిణీ చేయడానికి గాను 33,660 మందిని గుర్తించి వారికి తరువాత అద్దాలను అందజేయనున్నారు. 13,705 మందిని శస్త్ర చికిత్సలకు రెఫర్‌ చేశారు. అందులో 10,198 మందిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ఇతర ఏరియా ఆస్పత్రులకు, 3,507 మందిని హైదరాబాద్‌లోని సరోజిని, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రెఫర్‌ చేశారు.

ఉదయం నుంచే బారులు..
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించే తేదీలకు ముందుగానే ఆయా గ్రామాలు, వార్డుల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తెలియజేయడంతోపాటు.. డప్పు చాటింపులను వేయిస్తున్నారు. దీంతో ప్రజలు ఉదయం 9 గంటలకు ముం దే ఆయా శిబిరాల వద్ద బారులుదీరుతున్నారు. స్వచ్ఛం దంగా కంటివెలుగు కార్యక్రమంలో భాగస్వాములు అవుతుండడంతో సిబ్బంది ఉత్సాహంతో సేవలు అంది స్తున్నారు. కంటివెలుగు కార్యక్రమంలో నాణ్యమైన కంటి అద్దాలను ఉచితంగా అందిస్తుండడంతో ప్రజలు వాటిని తీసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా తమ ఆధార్‌ కార్డును తప్పక తీసుకురావాలని నిర్వాహకులు చెబుతున్నారు. 

ప్రజల నుంచి విశేష స్పందన 
కంటి వైద్య శిబిరాలకు ప్రజల నుం చి విశేష స్పందన వస్తోంది. ప్రజ లు స్వచ్ఛందంగా ఉదయం నుంచే క్యాంపు వద్ద బారులుదీరుతున్నా రు. నాణ్యమైన అద్దాలను అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అ మలు చే స్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. జనవరి 26 వరకు నిరంతరం శిబిరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. కె.భానుప్రసాద్‌నాయక్, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు