విషాదానికి 25 ఏళ్లు

4 Sep, 2018 11:36 IST|Sakshi
రాళ్లవాగు వద్ద మందు పాతర పేలుడు దృశ్యం (ఊహా చిత్రం)

కరకగూడెం (ఖమ్మం): మణుగూరు సబ్‌ డివిజన్‌లో పినపాక, కరకగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో 25 ఏళ్ల క్రితం మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. సమాంతర ప్రభుత్వాన్ని తలపించే రీతిలో మావోయిస్టులు పోలీసులకు సవాల్‌ విసిరేవారు. అయితే వారిని అణచివేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యూçహాలు రచించేది. ఇలా ఇరు వర్గాల మధ్య భీకర పోరు సాగేది. ఈ క్రమంలో 1992 సెప్టెంబర్‌ 4వ తేదీన పినపాక–కరకగూడెం మండలాల మధ్య గల రాళ్లవాగు వద్ద మావోయిస్టులు బ్రిడ్జిని పేల్చివేశారు. ఈ భారీ విస్ఫోటనానికి ఐదు మందు పాతరలను  వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి పినపాక మండలంలో మావోయిస్టు కదలికలను అరికట్టేందుకు కరకగూడెంలో నూతన పోలీస్‌స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
భద్రత కోసం వస్తూ ప్రాణాలు కోల్పోయారు.. 
కాగా, కరకగూడెం స్టేషన్‌ భద్రత కోసం ఏడూళ్ల బయ్యారం పోలీస్‌ స్టేషన్‌ నుంచి 10 మంది సిబ్బంది జీపులో కరకగూడెం పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరారు. వారి కదలికలను అడుగడుగునా తెలుసుకున్న మావోయిస్టులు పక్కా ప్రణాళికతో రాళ్లవాగు బ్రిడ్జికి మందుపాతరను అమర్చారు.  1992 సెప్టెంబర్‌ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాళ్లవాగు వద్దకు చేరుకున్న పోలీసుల జీపును మావోయిస్టులు పేల్చి వేశారు. పూర్తి అటవీ ప్రాంతమైన రాళ్లవాగు వద్ద నుంచి భారీ శబ్దాలు రావడంతో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. వేలాది మంది ఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులు ప్రయాణిస్తున్న తునాతునకలయిన జీపును, చెట్టుకొకటి, పుట్టకొకటిగా పడి ఉన్న పోలీసుల మృతదేహాలు గమనించి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనంగా నిలిచింది. ఇప్పటికీ ఏడూళ్ల బయ్యారం నుంచి కరకగూడెం రావాలంటే పోలీసులు  భారీ బందోబస్తుగానే వస్తుంటారు. పోలీస్‌ శాఖలో రాళ్లవాగు ఘటన పెను విషాదాన్ని నింపింది.

ఆనాటి విషాద ఘట్టంలో అమరులైన పోలీసులు వీరే.... 
డి. నరేందర్‌ పాల్‌ (రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌), ఎస్‌ఏ. జార్జ్‌    (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌), డి. ప్రభాకర్‌ రావు (ఏఆర్‌ ఎస్సై), ఐ. రామారావు (హెడ్‌ కానిస్టేబుల్‌), కానిస్టేబుళ్లు డి. శంకర్‌బాబు, జి. నాగేశ్వరరావు, ఎం. వెంకటేశ్వరరావు, జి. సత్యనారాయణ, వై.బేబిరావు, టి. సుబ్బారావు అమరుల త్యాగాలు చిరస్మరణీయం సమాజంలో పోలీస్‌ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. అలాగే వెలకట్టలే నివి. ప్రజల మధ్యలో ఉంటూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసులను ప్రతి రోజు స్మరించుకుంటున్నాం. వారి ఆశయ సాధనకు కృషి చేస్తాం. – ఆర్‌ సాయిబాబా మణుగూరు డీఎస్పీ 

స్మరించుకోవడం అందరి బాధ్యత 
సమాజ శ్రేయస్సే లక్ష్యంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యత. అలాగే అమరుల కర్తవ్యం, త్యాగాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి. – ఇ రాజ్‌కుమార్‌ కరకగూడెం ఎస్సై

మరిన్ని వార్తలు