కరాటే క్వీన్‌

25 May, 2019 07:22 IST|Sakshi
కరాటేలో విన్యాసాలు చేస్తున్న భవానీ

అంతర్జాతీయ పోటీల్లో సిటీ యువతి సత్తా  

‘‘నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు చెక్‌ పెట్టాలంటే ఆడపల్లలకు కరాటే ఎంతో దోహద పడుతుంది. మా అమ్మానాన్నలు కరాటే నేర్చుకోవాలన్నప్పుడు భయపడ్డా. ఇప్పుడు శిక్షణ పొందాక ఆ గొప్పతనం తెలుస్తోంది. అందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు కరాటే నేర్పేందుకు ముందుకు రావాలి’’ – భవాని

చాంద్రాయణగుట్ట: మహానగరంలో మహిళలు అర్ధరాత్రి కాదు.. పట్టపగలే నిర్భయంగా తిరలేని రోజులివి. ఏ మానవ మృగం ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో చెప్పలేని పరిస్థితి. పాతికేళ్ల క్రితమైతే తల్లిదండ్రులు బాలికలను చదువు మాన్పించి ఇంట్లోనే ఉంచేవారు. వయసు రాగానే పెళ్లి చేసి బరువు దించుకునేవారు. ఇప్పుడు రోజులు మారాయి.. ఆడపిల్లలను కన్నవారు తమ బిడ్డలకు మృగాళ్లను ఎదిరించడం నేర్పిస్తున్నారు. ఇంటిపట్టునే ఉంటే లోకజ్ఞానం ఎప్పుడు అబ్బుతుందని.. కట్టుకున్నవాడే బరితెగిస్తే అప్పుడు బేల చూపులు చూస్తూ కన్నీరు పెట్టుకోకూడదని చిన్నప్పుడే ధైర్యాన్ని నింపుతున్నారు. అక్షరభ్యాసంతో పాటే ఆత్మరక్షణ విద్యను నేర్పిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు అంబటి భాస్కర్, శోభ దంపతులు. రోజూ ఎక్కడోచోట మహిళలపై జరుగుతున్న దాడులను పత్రికల్లో చూసిన వీరు.. అలాంటి దుర్ఘటనలు ఎదురైతే ఎదిరించేలా తమ కూతురు భవానీకి కరాటే నేర్పిస్తున్నారు. ఇప్పుడామె జాతీయ స్థాయిలో రాణిస్తూ కన్నవారికి పేరు తెస్తోంది.  

‘నిర్భయ’ దుర్ఘటనతో..  
ఢిల్లీలో ‘నిర్భయ’ దుర్ఘఘటనతో దేశంలో చాలామంది తల్లిదండ్రులు తల్లడిల్లారు. భాస్కర్, శోభ మాత్రం భవానీకి కరాటేలో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం నగరంలోని అరోరా కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న భవానీని నాలుగేళ్ల క్రితం జంగమ్మెట్‌లోని నాయక్‌ బూడోఖాన్‌ కరాటే అకాడమీలో చేర్పించారు. చదువుకుంటూనే మాస్టర్‌ గణేష్‌ నాయక్‌ వద్ద శిక్షణ పొందింది. అక్కడి నుంచే పలు పోటీలకు సైతం హాజరైంది. జిల్లాస్థాయి పోటీలతో ప్రయాణం మొదలెట్టిన ఆమె అంతర్జాతీయ పోటీల్లో సైతం విజేతగా నిలిచింది. ఇప్పటి దాకా 13 జాతీయ, మూడు రాష్ట్ర, ఒక అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సొంతం చేసుకుంది. ఇటీవల బళ్లారిలో గ్రాండ్‌ చాంపియన్‌షిప్‌ సాధించిన భవాని త్వరలో మలేసియాలో జరిగే పోటీలకు ఎంపికైంది.

 తల్లిదండ్రులతో భవానీ
బాలికలకు ఉచితంగా..
ప్రతి వేసవిలో బాలికలకు ఉచితంగా కరాటే నేర్పిస్తున్నాం. పాతబస్తీలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కరాటేలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. భవానీ కరాటేలో చక్కగా రాణిస్తోంది. త్వరలో మలేసియా కూడా వెళ్లనుంది. ఆమె శిక్షణ పొందుతూనే ఎన్‌సీసీ క్యాంప్‌లో తోటి విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ఎన్‌సీసీలో కూడా ఆమె ప్రత్యేక ర్యాంక్‌ సాధించడం గొప్ప విషయం.– పి.గణేష్‌ నాయక్, కరాటే మాస్టర్‌ 

మరిన్ని వార్తలు