కరాటే పరశురాం..

19 Jun, 2018 11:02 IST|Sakshi
హీరో సుమన్‌ చేతుల మీదుగా బ్లాక్‌బెల్ట్, ప్రశంసా పత్రం అందుకుంటూ..

కరాటేలో రాణిస్తున్న  ఆటోవాలా పరశురాం

అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు

తాను నేర్చుకున్న విద్యను   ఇతరులకు నేర్పుతూ ఆదర్శం

ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యం..

పెద్దశంకరంపేట(మెదక్‌): ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు పేట మండలానికి చెందిన యువకుడు పరశురాం. ఓ వైపు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ, మరో వైపు కష్టపడి కరాటేలో రాణిస్తూ అనేక మంది మన్ననలు పొందుతున్నాడు మండల పరిధిలోని జూకల్‌ గ్రామానికి చెందిన ఈ యువకుడు.

చూడడానికి వెళ్లి..

ఒకసారి మెదక్‌లో జరుగుతున్న కరాటే పోటీలను పరశురాం చూడడానికి వెళ్లాడు. అక్కడే ఉన్న కరాటే మాస్టర్‌ నగేష్‌ను కలిసి తన అభిమతం చెప్పాడు. అతని సహాయంతో ఆటో నడుపుతూనే కరాటే నేర్చుకున్నాడు. ఇలా ఏడేళ్లుగా కరాటేలో శిక్షణ పొందుతూ పలు రాష్ట్ర, అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. గతేడాది బ్లాక్‌బెల్టు సాధించి ప్రముఖ సినీనటుడు సుమన్‌ చేతుల మీదుగా బెల్టు, ప్రశాంసా పత్రాన్ని అందుకున్నాడు.

పట్టుదలే లక్ష్యంగా...

జూకల్‌కు చెందిన పుట్ల బాలయ్య, మాణమ్మల కుమారుడు పరుశురాం. ఆరేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయాడు. మణమ్మ వారికి ఉన్న రెండెకరాల భూమిని సాగు చేసుకుంటూ కుమారుడిని చదివించింది. ప్రస్తుతం పరుశురాం పేటలో డీగ్రీ చదువుతూ ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 

అనేక పతకాలు పరశురాం సొంతం..

గతేడాది ముంబాయిలో జరిగిన 22వ అంతర్జాతీయ ఏషియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 13 దేశాలకు చెందిన వారు పాల్గొనగా అండర్‌-20 స్పారింగ్‌ బ్లాక్‌ బెల్ట్‌ విభాగంలో పరశురాం కాంస్య పతకం సాధించాడు. వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సైతం పాల్గొని పతకం సాధించాడు. 

ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆదర్శం..

తనకు వచ్చిన కరాటే విద్యను పరుశురాం తన సొంత గ్రామమైన జూకల్‌లో గ్రామస్థులకు, పేటలోని పలువురు విద్యార్థులకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు పరశురాం. ఇతని దగ్గర శిక్షణ పొందిన 14 మందిలో ఐదుగురు స్వర్ణపతకాలు సాధించడం విశేషం. దీంతో పాటు పేటలోని పలు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినిలకు సైతం పరశురాం కరాటే శిక్షణ ఇస్తున్నాడు. ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో పాల్గొని గ్రామానికి పేరు తేవడమే తన లక్ష్యమని పరుశురాం చెబుతున్నాడు.

మరిన్ని వార్తలు