కరెంట్ కాటుకు ఇద్దరి బలి

13 Aug, 2014 02:21 IST|Sakshi
కరెంట్ కాటుకు ఇద్దరి బలి

 పిల్లలమర్రి(సూర్యాపేటరూరల్) :తెల్లవారుజామునే కరెంట్ ఇద్దరిని కాటేసింది.  మంగళవారం జిల్లాలోని సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలో గేదెను లేపబోయి మహిళ, పాలుపితికేందుకు వ్యవసాయ బావివద్దకు వెళ్తున్న రైతు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. వీరితో పాటు గేదె కూడా మృతిచెందింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు చోటు చేసుకున్నాయని మృతుల బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
 
 గేదెను లేపబోయి..
 సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన బొమ్మగాని వెంకటయ్య భార్య కేశమ్మ(50)లకు చెందిన పాడి గేదె ఉంది. అది తెల్లవారుజామున ఇంటి ముందు గల విద్యుత్‌స్తంభం స్టేవైరుకు రాసుకోవడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. అది గమనించని ఓ మహిళ గేదె వీధిలో పడుకుందని కేశమ్మకు చెప్పింది. కాగా, కేశమ్మ నిద్రలేచి అక్కడకు వెళ్లి తమ గేదెను లేపే ప్రయత్నం చేసింది. గేదె అప్పటికే విద్యుదాఘాతంతో మృతిచెందగా కేశమ్మ దానిని పట్టుకోగా ఆమెకు కూడా విద్యుత్ ప్రసరణ జరిగి అక్కడికక్కడే మృతిచెందింది. అప్పటికే నిద్ర లేచిన కేశమ్మ కూతురు లక్ష్మి బయటకు వెళ్లి విద్యుత్ స్తంభం వద్ద తల్లి, గేదె కింద పడి ఉన్న సంఘటనను చూసింది. దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయగా గేదె తోక తగలడంతో కొంత దూరంలో ఎగిరిపడింది. లక్ష్మి లేచి ఇంట్లోకి వెళ్లి అన్న నగేష్‌కు విషయాన్ని వివరించింది. వెంటనే నగేష్ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేశా డు. సంఘటన స్థలం వద్దకు వచ్చి చూసే వరకు తల్లి, గేదె మృతిచెంది ఉండడంతో బోరున విలపించాడు. గ్రామస్తులు విషయాన్ని ట్రాన్స్‌కో ఏఈ శ్రీనువాస్‌కు వివరించినా స్పదించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 డీఈ కార్యాలయం ఎదుట ఆందోళన
 ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కేశమ్మ మృతదేహంతో గ్రామస్తులు సూర్యాపేట డీఈ కార్యాలయం ఎదుట మూడు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో హైవేపై రాస్తారోకో చేశారు. మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, సంఘటనకు కారకులైన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రవణ్‌కుమార్ రాస్తారోకో వద్దకు చేరుకుని, విద్యుత్ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆందోళన వద్దకు రావాలని డీఎస్పీ విద్యుత్ అధికారులను కోరినా ఎవరూ రాలేదు.
 
 ఆగ్రహించిన ఆందోళనకారులు మృతదేహాన్ని కార్యాలయంలోనే ఖననం చేస్తామనడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో సంబంధింత శాఖ అధికారులు కార్యాలయం చేరుకున్నారు.అందోళనకారులతో మాట్లాడి మృతురాలి కుటుంబానికి లక్షన్నర తక్షణ సాయంగా విద్యుత్ అధికారులు అందించారు. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ఇప్పించేందుకు కృషిచేస్తామని డీఈ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. ఆందోళనలో గ్రామసర్పంచ్ సోమగాని లింగస్వామిగౌడ్, రాపర్తి సైదాలు, రాపర్తి శ్రీను, సోమగాని సత్యనారాయణ, సోమగాని యాదగిరి, జెర్రిపోతుల శ్రీనువాస్, జే.యాదగిరి, సైదులు, రాపర్తి మహేష్, సట్టు జానయ్య, దాసరి లచ్చయ్య, వల్లాల సైదులుతో పాటు సుమారు 200 మంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు