ఖాకీచకుడు

9 Jan, 2015 09:46 IST|Sakshi

-అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్సై
-సెల్ టవర్ ఎక్కిన మహిళలు
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేప్లలి ఎస్సై తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, దుర్భాషలాడారంటూ ముగ్గురు మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. తమకు జరిగిన అవమానానికి ఆత్మహత్య చేసుకుంటామంటూ కారేపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న సెల్‌టవర్‌పై ఎక్కారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఘర్షణ నేపథ్యంలో మండల పరిధిలోని పాటిమీదిగుంపు గ్రామానికి చెందిన ధారావత్ చంద్రకళ(వికలాంగురాలు), హలావత్ బుజ్జి, బాణోతుబుల్లికి సంబంధించిన తొమ్మిది మందిపై  కారేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి వీరిలో జగన్, రవి, వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రోజంతా అక్కడే ఉంచుకుని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో మిగతా ఆరుగురు నిందితులతో పాటు చంద్రకళ, బుజ్జి, బుల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.

ఎస్సై పి.సంతోష్ విచక్షణ కోల్పోయి తొమ్మిది మందిని తీవ్రంగా కొట్టారు. అక్రమంగా కేసులు పెట్టి, తమ వారిని ఎందుకు కొట్టుతున్నారని ప్రశ్నించగా మహిళలు అని కూడా చూడకుండా దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన  చంద్రకళ, బుజ్జి, బుల్లి సెల్‌టవర్ ఎక్కారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని, తమ వారిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఇల్లెందు రూరల్ సీఐ డి.రమేష్, ఎస్సై పి.మహేష్, తహశీల్దార్ ఎం.మంగీలాల్, ఎంపీడీఓ పి.అల్బర్ట్, ఎంపీపీ బాణోతు పద్మావతి అక్కడికి చేరుకున్నారు. ‘మీకు న్యాయం చేస్తాం కిందికి దిగండి’ అంటూ ఇల్లెందు రూరల్ సీఐ రమేష్, తహశీల్దార్ మంగీలాల్, ఎంపీపీ పద్మావతి ఆందోళనకారులతో  ఫోన్‌లో మాట్లాడారు. దీంతో ఆ మహిళలు కిందికి దిగారు.

 

మరిన్ని వార్తలు