కరీంనగర్‌ కదనరంగం

12 Nov, 2018 19:55 IST|Sakshi

నియోజకవర్గంలో మూడు పార్టీల అభ్యర్థులే కీలకం 

కరీంనగర్‌ తొలి ఎమ్మెల్యే  వెంకటరామారావు 

 ప్రత్యేకతను చాటిన చొక్కారావు 

అన్ని పార్టీలను ఆదరించిన ఓటర్లు

 బీసీ ఓటర్లదే తీర్పు అంటున్న రాజకీయవేత్తలు

 ఈ సారి రసవత్తరంగా ‘త్రిముఖ’ పోరు 

కరీంనగర్‌: ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్‌. ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా ప్రతిష్టాత్మకమే. అన్ని పార్టీలకు కీలకమే. ఇక్కడి ఓటర్లు ప్రతీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిస్తూ అందరి నాయకుల్ని ఆదరించిన సందర్భాలు గత చరిత్రలో ఉన్నాయి. జిల్లా కేంద్రంగా రాష్ట్రంలోనే ప్రత్యేకతను సాధించిన కరీంనగర్‌ నియోజకవర్గంగా పేరొందింది. ఓసీలకు ముఖ్యంగా వెలమలకు కంచుకోట. నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఆసామాజిక వర్గానికి చెందిన వారు లేకుండా ఎన్నికలు ఉండేవి కావు. అయితే ఈ సారి ముగ్గురు బీసీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో త్రిముఖపోటీ ఆసక్తికరంగా మారింది. 

ఇక్కడి నుంచే ప్రముఖులు 
ఈ నియోజకవర్గం నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్ర, జిల్లా రాజకీయ యవనికపై తమదైన ముద్ర వేశారు. జువ్వాడి చొక్కారావు, కటుకం మృత్యుంజయం, ఎం. సత్యనారాయణ రావు రాష్ట్రస్థాయిలో తమదైన ముద్రవేశారు. నియోజక వర్గం అవిర్భావం నుంచి భిన్న పార్టీల సభ్యులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఇక్కడిప్రజలు ఆమితాసక్తిని చూపించారు. ప్రజాసేవ కోసం అందరికీ అవకాశాన్ని అందించారు. ఒకే వ్యక్తికి రెండు పర్యాయాలు అవకాశమిచ్చినా.. మరో     ఎన్నికల్లో వేరే వారిని ఎన్నుకున్నా.. పనితీరు     బాగోకుంటే నిర్మొహమాటంగా వేరే అభ్యర్థిని గెలిపించుకున్నా.. అది కరీంనగర్‌ అసెంబ్లీ స్థానంలోని ప్రజానీకానికే చెల్లింది. ఆరు దశాబ్దాలకుపైబడిన రాజకీయ పోరును అద్యంతం ఆసక్తికరంగా మార్చుకునే కరీంనగర్‌ నియోజక వర్గంలో ప్రతి ఎన్నికల్లోను విజేత ఎంపిక విషయంలో ఓటర్లు కడదాక ఎడతెగని ఉత్కంఠను చూపిస్తూనే ఉన్నారు. 
 

కరీంనగర్‌ భౌగోళిక చరిత్ర.... 
కరీంనగర్‌ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో నియోజక వర్గాల పునర్విభజన తరువాత గతంలో ఉన్న తిమ్మాపూర్, మానకొండూర్‌ మండలాలు కొత్తగా ఏర్పడిన మానకొండూర్‌ నియోజక వర్గంలో కలవడంతో కేవలం కరీంనగర్‌ పట్టణం, కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి మండలాలు మాత్రమే కరీంనగర్‌ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,77,236 మంది ఉన్నారు. పురుషులు 1,39,153 మంది, మహిళలు 1,38,047 మంది, ఇతరులు 36 మంది ఉన్నారు. 
 

 14సార్లు ఎన్నికలు...
శాసనసభ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కరీంనగర్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించడంలో ప్రధాన రాజకీయ పక్షాలు సముజ్జీలుగా నిలుస్తూ వచ్చాయి. మొత్తంగా 14సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి, మరొకసారి సోషలిస్టు పార్టీ, ఇంకోసారి పీడీఎఫ్‌ తరఫున బరిలో నిలిచిన వారు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థికి ఇక్కడి ప్రజలు అవకాశాన్నిచ్చారు.  
 

మూడుసార్లు 
గెలిచిన
 ‘జువ్వాడి’ 

ఇక కరీంనగర్‌ ఎమ్మెల్యేగా జువ్వాడి చొక్కారావు ముచ్చటగా మూడు సార్లు గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున 1957లో గెలిచిన ఈయన 1967,1972 సంవత్సరాల్లో విజయం సాధించి కరీంనగర్‌కు సరికొత్త ఖ్యాతిని ఆ కాలంలో అందించేందుకు ప్రత్యేక చొరవ చూపించారు. మంచి నాయకుడిగా మన్ననల్ని పొందారు. అంతేకాకుండా మూడుసార్లు ఇక్కడ ఎంపీగా గెలిచి సరికొత్త రికార్డును తనఖాతాలో వేసుకున్నారు. కరీంనగర్‌ పట్టణంతో పాటు పాత కరీంనగర్‌ మండలాల్లోని గ్రామాలతోనే ఈ నియోజక వర్గం ఏర్పాటైంది. ఈ నియోజక వర్గ తొలి ఎమ్మెల్యేగా పీడీఎఫ్‌ పార్టీకి చెందిన సీహెచ్‌ వెంకటరామారావు గెలుపొందారు. 66 ఏళ్ల కిందట 40 వేల ఓటర్లున్న నియోజక వర్గం ఇప్పుడు పెరిగిన జనాభాకు అనుగుణంగా 2.77 లక్షలకు పెరగడం విశేషం.
 

చందాలు వేసుకుని గెలిపించారు 
1983లో సంజయ్‌ విచార్‌ మంచ్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కరీంనగర్‌ ఎమ్మెల్యేగా గెలిచా. మిత్రులు, బంధువులు రూ.3 లక్షలు పోగుచేసి ఇచ్చారు. నా సొంత ఖర్చు ఒకరూపాయి లేదు. నాటి ఎన్నికలకు, నేటి ఎన్నికలకు చాలా     తేడా ఉంది. నాడు ప్రజలే అభిమానంతో చందాలు వేసుకోని గెలుపుకోసం కృషి చేసేవారు. ఏమి అశించే వారు కాదు.. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో రూపకంగా అభ్యర్థుల నుంచి సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. దీంతో రాజకీయాలు అంటే ప్రజల్లో ఎవగింపు గా మారింది.  ఏ విషయంలోనైనా ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు కలిసి చర్చించుకునే అలవాటు అప్పుడు ఉండేది. ఇప్పుడు అలాంటివి కనిపించడం లేదు. అధికారులదే హావా నడుస్తోంది.     కుల రాజకీయాలు, డబ్బు, బంధువర్గం రాజ్యమేలుతోంది. పార్టీలు కూడా టికెట్లు ఇవ్వాలంటే ఎంత డబ్బు ఉంది అని అడిగే పరిస్థితి రావడం విచారకరం. – కటుకం మృత్యుంజయం,డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు