కరీంనగర్‌ కార్పొరేషన్‌: తడబడ్డ కార్పొరేటర్లు...

30 Jan, 2020 09:03 IST|Sakshi
మంత్రి గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న మేయర్‌ సునీల్‌రావు అపర్ణ దంపతులు

 మేయర్‌గా యాదగిరి సునిల్‌రావు

రాజేందర్‌రావుకు అధిష్టానం బుజ్జగింపు 

స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్‌

అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేసిన మంత్రి గంగుల

త్వరలో రాజేందర్‌రావుకు కీలక పదవి

గంగుల అండతో డిప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూప

మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ ఆశలపై నీళ్లు

సాక్షి,  కరీంనగర్‌ : కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ యాదగిరి సునిల్‌రావును, డెప్యూటీ మేయర్‌గా 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ చల్లా స్వరూపరాణిని ఎన్నుకున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో గెలిచిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్‌ డెప్యూటీ మేయర్‌ ఎన్నికకు కార్పొరేషన్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండురోజులక్రితం క్యాంపునకు వెళ్లిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు బుధవారం ఉదయమే కరీంనగర్‌ చేరుకుని శ్వేత హోటల్‌లో  పార్టీ సమావేశం నిర్వహించారు. మేయర్‌ , డెప్యూటీ మేయర్‌ ఎన్నికపై అవగాహన కల్పించారు. ఉదయం 11 గంటల సమయంలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ర్యాలీగా కార్పొరేషన్‌ కార్యాలయానికి  తరలివచ్చారు. అనంతరం బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు సమావేశం మందిరానికి చేరుకున్నారు. కరీంనగర్‌ జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌ తెలుగు అక్షరమాల ప్రకారం వరుస క్రమంలో కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం 11.55 గంటలకు ముగిసింది. అనంతరం జేసీ 12.30 గంటలకు మేయర్, డెప్యూటీ మేయర్‌ ఎన్నికను ప్రకటించారు. బీజేపీ కార్పొరేటర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. టీఆర్‌ఎస్, ఇటీవల పార్టీలో చేరిన ఇండిపెండెంట్లు, ఏఐఎఫ్‌బీ, ఎంఐఎం కార్పొరేటర్లు హాల్‌లో ఉండిపోయారు.  

ఏకగ్రీవ ఎన్నిక...
కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ 12.30 గంటలకు ఎన్నిక ప్రారంభించారు. ఎన్నికకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాశాఖ మంత్రి గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ హాజరయ్యారు. మేయర్‌ ఎన్నికకు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు 33 మంది, ఇండింపెండెట్లు, ఏఐఎఫ్‌బీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఏడుగురు, ఆరుగురు ఎంఐఎం కార్పొరేటర్లతో కలిపి 46 మందితోపాటు ఇద్దరు ఎక్స్‌ ఆఫిషియో సభ్యులుగా మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయి హాజరు కావడంతో సంఖ్య 48కు చేరింది. కోరం సరిపోవడంతో మేయర్‌ ఎన్నిక నిర్వహించారు. మేయర్‌ స్థానానికి యాదగిరి సునిల్‌రావును 3వ డివిజన్‌ కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌ ప్రతిపాదించగా 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆర్ష కిరణ్మయి బలపరిచారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం సునిల్‌రావుకు బీ–ఫాం ఇవ్వడంతోపాటు విప్‌ జారీ చేసింది. ఎవరూ కూడా పోటీలో లేకపోవడంతో సునిల్‌రావును మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకైనట్లు జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌ ప్రకటించారు. అనంతరం డెప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపరాణిని 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఐలేందర్‌యాదవ్‌ ప్రతిపాదించగా,18వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుదగోని మాధవి బలపరిచారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవం అయినట్లు జేసీ ప్రకటించారు. అనంతరం మేయర్, డెప్యూటీ మేయర్‌లను జేసీ, మున్సిపల్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కూడా అభినందించారు.  

నీతివంతమైన పాలన అందించాలి
కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఓటర్లు, ప్రజలు ఎంతో నమ్మకంతో టీఆర్‌ఎస్‌కు పట్టంకట్టారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మేయర్, డెప్యూటీ మేయర్‌కు మంత్రి సూచించారు. నీతివంతమైన పాలన అందించాలని కోరారు. మేయర్, డెప్యూటీ మేయర్, 60 మంది కార్పొరేటర్ల వేర్వేరుకాదని అంతా ఒకటేనని సమన్వయంతో కరీంనగర్‌ను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఇంటింటింకీ మంచినీటిని అందించడానికి చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలిపారు. 

ప్రమాణ స్వీకార సమయంలో పలువురు కార్పొరేటర్లు తడబడ్డారు. ఆకుల పద్మ, కొలిపాక అంజయ్య ఇబ్బందిపడ్డారు. మూడుసార్లు ప్రమాణస్వీకారం చేసిన ఎడ్ల సరిత కూడా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ప్రమాణపత్రం చదువుతూ తడబడ్డారు. ఐదుసార్లు గెలిచిన నేతికుంట యాదయ్య, జయలక్ష్మి, రాపర్తి విజయ కూడా తడబడుతూ ప్రమాణపత్రాన్ని చదివారు. 38వ డివిజన్‌ కార్పొరేటర్‌ కచ్చు రవి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జై భారత్‌మాతా అంటూ, 49వ డివిజన్‌ కార్పొరేటర్‌ కమల్‌జిత్‌ కౌర్‌ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. 

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
ప్రజలు ఎంతో నమ్మకంతో పట్టం కట్టారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మేయర్‌ సునిల్‌రావు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని మేయర్‌గా తన ఎన్నికకు కృషి చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, సహకరించిన కార్పొరేటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కరీంనగర్‌ : ప్రథమ పౌరుడి ఎంపికలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం సీనియారిటీకే ప్రాధాన్యత ఇచ్చింది. కరీంనగర్‌ మేయర్‌గా యాదగిరి సునీల్‌రావును పార్టీ నిర్ణయించింది. కౌన్సిలర్, కార్పొరేటర్‌గా నాలుగుసార్లు ఎన్నికైన 33వ వార్డు కార్పొరేటర్‌ సునీల్‌రావుకే ప్రథమ పౌరుడి హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. మేయర్‌ స్థానం కోసం పోటీ పడ్డ 56వ వార్డు కార్పొరేటర్‌ వంగపెల్లి రాజేందర్‌రావును అధిష్టానం బుజ్జగించింది. హైదరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ మంగళవారం సాయంత్రం సునీల్‌రావు, రాజేందర్‌రావులతో సమావేశమై సీఎం కేసీఆర్‌ మేయర్‌గా సునీల్‌రావును ఎంపిక చేసిన విషయాన్ని వెల్లడించారు. రాజేందర్‌రావుకు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పించే హామీ ఇచ్చినట్లు చెప్పారని సమాచారం. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా రాజేందర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడారు

మరిన్ని వార్తలు