కారు జోరు కొనసాగేనా?

8 Nov, 2018 13:26 IST|Sakshi

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఎదురుందా?

బలంగా తెలంగాణ సెంటిమెంట్‌

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి

కరీంనగర్‌.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ. తెలంగాణ సెంటిమెంట్‌ బలంగా ఉన్న గడ్డ. అలాంటి గడ్డపై కూటమి అభ్యర్థులు ఏ మేరకు ప్రభావం చూపుతారో!

సాక్షి, కరీంనగర్‌: గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఉన్న 13 స్థానాల్లో 12 స్థానాల్ని టీఆర్‌ఎస్‌ క్రైవసం చేసుకుందంటేనే చెప్పచ్చు అక్కడ కారు జోరు ఎంతలా ఉందో. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది ఒకే ఒక్క స్థానం. ఈసారి ఎన్నికల్లో కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ఏ మేరకు ప్రభావం చూపుతాయి? కారు జోరుకు బ్రేకులు వేస్తాయా?

హుస్నాబాద్‌ ఎవరికో
హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిస్థితి అయోమయంగా ఉంది. పొత్తులో భాగంగా సీపీఐ ఈ సీటు కావాలని పట్టుబడుతోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి సొంత నియోజక వర్గం కూడా కావడంతో ఇక్కడ ఎలాగైనా గెలుస్తామనే దీమాతో సీపీఐ శ్రేణులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి ప్రవీణ్‌ రెడ్డి కూడా సీటు కోసం పట్టుబడుతుండడంతో కాంగ్రెస్‌ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఇద్దరి మధ్య కాంగ్రెస్‌ పెద్దలు ఎలా సంధి కుదురుస్తారో మరి. నియోజకవర్గంలో నెలకొన్న ఈ పరిస్థితి అధికార టీఆర్‌ఎస్‌కు లాభించేలా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని ఎలాగైనా తమకు అనుకూలంగా మలచుకొని గెలవాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులు యోచిస్తున్నాయి.

ప్రవీణ్‌ రెడ్డికే సై అనేనా?
ఒక వేళ కాంగ్రెస్‌ పార్టీ ప్రవీణ్‌ రెడ్డికే సీటు కేటాయిస్తే ఎలా ?అని చాడా వర్గీయులు లోలోపల మదనపడుతున్నారు.అలాంటి తరుణంలో అనుసరించాల్సిన వ్యూహల గూర్చి చర్చిస్తున్నారు.ఇదిలా ఉండగా చాడా మాత్రం తనకు తప్పకుండా సీటు వస్తుందనే ధీమాతో ఉన్నట్లు సమాచారం.మరో వైపు ప్రవీణ్‌ రెడ్డి కూడా టికెట్‌ విషయంలో ధీమాగా ఉన్నారు. 

జగిత్యాల జీవన్‌ రెడ్డికేనా?
గత ఎన్నికల్లో కరీంనగర్‌లో కాంగ్రెస్‌ గెలిచిన ఏకైక స్థానం జగిత్యాల. పోయిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎల్‌ రమణపై గెలిచి జీవన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి కలిసి పోటీ చేస్తుండటంతో ఈ సీటు ఎవరికి కేటాయించాలనే సందిగ్దత నెలకొంది. ఎల్‌ రమణ కోరుట్ల నుంచి పోటీకి సుముఖంగా ఉండడంతో జగిత్యాల సీటు విషయంలో స్పష్టత వచ్చింది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మరోసారి బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ఆయన పేరు ప్రకటించాల్సివుంది.

పొన్నం పోటీ చేసేనా?
గతంలో కరీంనగర్‌ ఎంపీగా పనిచేసిన పొన్నం ప్రభాకర్‌ ఈ సారి కరీంనగర్‌ అసెంబ్లీకి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోటీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో పొన్నంకు పోటీ తగ్గిందనే చెప్పవచ్చు. అధిష్టానానికి పంపిన అభ్యర్థుల జాబితాలో పొన్నం పేరు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తనకు సీటు ఖాయమన్న దీమాతో ఉన్న పొన్నం ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. 

శృతి తప్పిన రసమయి రాగం
మానకొండూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న రసమయి బాలకిషన్‌ ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. కానీ రసమయికి ప్రజావ్యతిరేకత బాగా పెరిగిందనే చెప్పవచ్చు. ప్రచారంలో భాగంగా రసమయికి తాకిన నిరసనే దీనికి నిదర్శనం. రసమయి స్థానికుడు కాకపోయినా ఉద్యమకారుడనే ఒకే ఒక్క కారణంతో గత ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఈ నాలుగేళ్లలో నియోజకవర్గాన్ని ఆయన సరిగా పట్టించుకోలేదని ప్రజలు భావిస్తున్నారు. దీంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. కూటమి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కాంగ్రెస్‌ నేత ఆరెపల్లి మోహన్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు