‘స్వచ్ఛత’లో నం.1

26 Aug, 2019 12:32 IST|Sakshi
మొగ్ధుంపూర్‌లో ఏర్పాటు చేసిన బోర్డు

స్వచ్ఛ దర్పణ్‌లో జాతీయ, రాష్ట్రస్థాయిలో జిల్లాకు మొదటిర్యాంకు

జాతీయస్థాయిలో గుర్తింపు

గ్రామాల్లో ఓడీఎఫ్‌ బోర్డుల ఏర్పాటు

సాక్షి, కరీంనగర్‌: స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో కరీంనగర్‌ జిల్లాకు మొదటిర్యాంకు వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛదర్పణ్‌లో కరీంనగర్‌ జిల్లాకు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో మొదటిర్యాంకు రావడంతో గుర్తింపు వచ్చింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని నాలుగు జిల్లాలు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లాలు వందశాతం మార్కులతో మొదటిర్యాంకు సొంతం చేసుకున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఉపయోగం, తడి,పొడి చెత్తనిర్వహణ, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం జిల్లావ్యాప్తంగా చేపట్టిన ప్రచార కార్యక్రమాలు, ప్రజలను భాగస్వాములను చేయడం, మహిళాసంఘాలు, స్వచ్ఛగ్రాహీల భాగస్వామ్యం, గ్రామస్థాయి ప్రజల సమన్వయంతో వివిధ అంశాలతో చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రాతిపదికన తీసుకున్నారు.

ఓడీఎఫ్‌ కోసం విస్తృతప్రచారం..
జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం చేపట్టింది. కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మండలాలు, గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 2017లోనే జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. స్వచ్ఛభారత్‌కు సంబంధించిన ఐదు విభాగాల్లోనూ జిల్లాప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ–32, స్వచ్ఛభారత్‌పై అవగాహనలో 32మార్కులు లభించాయి. తడి,పొడి చెత్త సేకరణ, ఘన, ద్రవవ్యర్ధాల నిర్వహణలో 16మార్కులు, జియోట్యాగింగ్, కమ్యూనిటీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం, స్వచ్ఛభారత్‌ అనుబంధ కార్యక్రమాల విభాగంలో 20 మార్కులతో కలుపుకుని వందమార్కులు సాధించింది. జాతీయ,రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించడంతో గుర్తింపు లభించింది.

బోర్డులతో గ్రామాల్లో స్వాగతం..
జిల్లావ్యాప్తంగా ఓడీఎఫ్‌ ప్లస్‌లో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రవేశానికి ముందు బోర్డులు ఏర్పా టు చేస్తున్నారు. ‘బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి పొందిన గ్రామం’ మీకు స్వాగతం పలుకుతుందంటూ అన్ని గ్రామాల్లో స్వాగతబోర్డులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతీ గ్రామంలో ప్రధాన చౌరాస్తాల్లో మరుగుదొడ్ల వినియోగం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై వాల్‌పెయింటింగ్‌ చేస్తున్నారు. గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లను వినియోగించడంపై అవగాహన కల్పిస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు