దసరాకు ‘ఐటీ టవర్‌’

22 Aug, 2019 10:11 IST|Sakshi
నిర్మాణం పూర్తి దశలో ఉన్న ఐటీ టవర్‌ ,మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ 

సాక్షి, కరీంనగర్‌ :  కరీంనగర్‌ యువత కలలు సాకారం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ తర్వాత ఆ స్థాయిలో నిర్మాణం చేసిన ఐటీ టవర్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్‌ 8న విజయదశమి(దసరా) రోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు టవర్‌ను సిద్ధం చేస్తున్నారు. ముహూర్తం నాటికి మూడు ఫ్లోర్‌లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనుల్లో వేగం పెంచారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని లోయర్‌ మానేరు డ్యాం సమీపంలో రూ.30 కోట్ల నిధులతో జీ+5 అంతస్తులతో 65 వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూపుదిద్దుకుంటున్న ఐటీ టవర్‌ కరీంనగర్‌కు ఐకాన్‌గా మారనుంది. ప్రపంచం ఐటీ వైపు పరుగుతీస్తున్న సమయంలో నిర్మాణం పూర్తిచేసుకుంటున్న ఐటీటవర్‌ కరీంనగర్‌ను ప్రపంచపటంలో నిలపనుంది.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత రెండవ స్థానం కరీంనగర్‌ ఐటీ టవర్‌కు దక్కనుంది. 2018 జనవరి 8న శంకుస్థాపన జరిగిన రోజే 11 కంపెనీలు ఎంవోయూ చేసుకున్నాయి. ఇతర దేశాల్లో స్థిరపడ్డ తెలంగాణకు చెందిన ఐటీ కంపెనీలు ఐటీ టవర్‌ ప్రారంభం రోజే కంపెనీలను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కంపెనీల స్థాపన ద్వారా సుమారు 1200 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభించే సువర్ణావకాశం ఉంది. అతిపెద్ద వనరుగా ఉన్న యువత మెట్రో నగరాలకు వలస వెళ్లే అవసరం లేకుండా ఆ స్థాయి ఐటీ ఉద్యోగాన్ని స్థానికంగానే ఉంటూ చేసుకునేందుకు చక్కటి అవకాశం దక్కనుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ మన ప్రాంతంలో ప్రారంభమవడమే కాకుండా ఉద్యోగార్థులకు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌(టాస్క్‌) ద్వారా ప్రపంచస్థాయి శిక్షణతో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఐటీతో మన యువత ప్రపంచంతో పోటీ పడేందుకు కరీంనగర్‌ కేరాఫ్‌గా మారనుంది. 

అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది...
ఐటీ కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో... జిల్లా కేంద్రాల్లో కూడా ఐటీని నెలకొల్పాలనే ప్రభుత్వ సంకల్పం అభివృద్ధి వికేంద్రీకరణకు దోహదపడుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం ఎల్‌ఎండీ సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఐటీ టవర్‌ పనులను టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డితో కలిసి పరిశీలించారు. దసరాకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు టవర్‌ను సిద్ధం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.   

హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద ఐటీ..
– టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డిరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద ఐటీ టవర్‌ను కరీంనగర్‌లో స్థాపించడం జరుగుతుందని తెలంగాణ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ నర్సింహరెడ్డి అన్నారు. కంపెనీలను స్థాపించే వారికి పవర్‌టారిఫ్, బ్రాండ్‌బాండ్‌ నెట్‌వర్క్‌లో రాయితీలను, అదనపు ప్రోత్సాహకాలను కూడా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుగ్గిళ్లపు రమేశ్, కట్ల సతీష్, బోనాల శ్రీకాంత్, ఆర్కిటెక్చర్‌ చేతనాజైన్, కాంట్రాక్టర్‌ సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు