కాన్సర్‌ మహమ్మారి: ప్లీజ్‌.. మాకు సాయం చేయండి

11 Jan, 2020 13:53 IST|Sakshi
కాన్సర్‌ పేషెంట్‌ సమ్మయ్య- అతడి తల్లి

కన్నతల్లి.. కట్టుకున్న భార్య.. ఇద్దరు కూతుళ్లకు అతడే కొండంత అండ. పేదరికంలో ఉన్నా ఏనాడు వారికి లోటు రాకుండా చూసుకున్నాడు. ఆర్‌ఎంపీగా వైద్య సేవలు అందిస్తూ నలుగురిలో మంచిపేరు సంపాదించుకున్నాడు. అయితే విధి మాత్రం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. క్యాన్సర్‌ రూపంలో వెంటాడి.. ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. దీంతో తనకు తల కొరివి పెడుతాడకున్న కొడుకు తన కళ్లముందే వేదన అనుభవిస్తుండటం ఆ తల్లి తట్టుకోలేకపోతోంది. ఇన్నాళ్లు తమను కంటికి రెప్పలా కాచిన తండ్రి శాశ్వతంగా దూరమవుతాడని తెలిసి అతడి కూతుళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కడదాకా తోడుంటానని బాస చేసిన భర్త.. ఇలా తనకు జీవిత కాలపు విషాదాన్ని మిగల్చబోతున్నాడంటూ అతడి భార్య విలపిస్తోంది. భర్తను కాపాడుకునేందుకు దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది.
  
కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి సమ్మయ్య(40)కు ఇరవై ఏళ్ల క్రితం.. తన మేనమామ కూతురు కవిత(34)తో వివాహం జరిగింది. ఆయన ఆర్‌ఎంపీగా వైద్య సేవలు అందిస్తూ తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తుండేవాడు. కవిత తన భర్తతో కలిసి వ్యవసాయం పనులకు వెళ్తుండేది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉన్నంతలో హాయిగా జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు సుచిత్ర(18), వైష్ణవి(14) ఉన్నారు. నాలుగేళ్ల కింద వెన్నంపల్లిలో అంగన్‌వాడీ పోస్టు ఖాళీగా ఉండడంతో కవిత ఆయాగా ఎంపికైంది. భర్త సంపాదన, అంగన్‌వాడీ విధులతో కుటుంబం హాయిగా గడుస్తోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం సమ్మయ్యకు తీవ్రమైన తలనొప్పి రావడంతో కరీంనగర్‌లోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వైద్యులు ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించుకోమని సూచించారు. ఆ స్కానింగ్‌లో తలలో ట్యూమర్‌ ఉందని తేలడంతో 5 నెలలు చికిత్స చేయించారు. అయినా తలనొప్పి తగ్గకపోవడంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకోవాలని చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ న్యూరో విభాగం ప్రత్యేక వైద్యులను సంప్రదించగా ఆపరేషన్‌ చేయాలని సూచించారు. నెలరోజులు హైదరాబాద్‌లో ఉండి ఆపరేషన్‌ చేయించారు. శస్తచికిత్స అనంతరం క్యాన్సర్‌ కణాలు పెరగకుండా రేడియేషన్‌ చేయించుకోవాలని సూచించడంతో తమకు ఉన్న ఎకరం పొలం తాకట్టు పెట్టి.. అప్పులు చేసి దాదాపు రూ. 8 లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేసుకున్నారు. 

70 ఏళ్ల వయస్సులో కూలీ పనులకు..
సమ్మయ్య భార్య కవితకు వస్తున్న రూ. 6 వేల జీతం సరిపోక ఇద్దరు కుటుంబ పిల్లల పోషణ, భర్త వైద్యం ఖర్చులు భరించలేక కుటుంబం విలవిల్లాడిపోతుంది. ఇలాంటి సమయంలో సమ్మయ్య తల్లి మధురమ్మ తనకు వచ్చే పెన్షన్‌ డబ్బులను కొడుకు వైద్యం కోసం ఖర్చుపెడుతోంది. 70 ఏళ్ల వయసులో కొడుకు వైద్యం ఖర్చుల కోసం ఆమె కూలీ పనులకు వెళ్తుండడం పలువురిని కలిచివేస్తోంది.. రేడియేషన్‌ అనంతరం శరీరం బాగా క్షీణించడంతో సమ్మయ్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది.  

చార్జీలకు  సైతం ఇబ్బందే..
సమ్మయ్య పదిహేను రోజులకొకసారి హైదరాబాద్‌లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రవాణా ఖర్చులకు సైతం డబ్బులేదని కవిత వాపోతోంది. ఇరుగుపొరుగు, బంధువుల వద్ద చార్జీలకు డబ్బు తీసుకుని ఆసుపత్రికి వెళ్తున్నారు. క్యాన్సర్‌ రోగులకు వర్తించే ఫించను మంజూరు చేస్తే కొంత మేరకైనా ఖర్చులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ప్రస్తుతం తన వద్ద చిల్లిగవ్వ కూడా లేక భర్తను బతికించుకునేందుకు ఆయాగా విధులు నిర్వర్తిస్తూ.. రాత్రిపూట నిద్ర లేకుండా భర్తకు సేవలు చేస్తూ గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మనసున్న మారాజులు, స్వచ్చంద సంస్థలు ఎవరైనా ఆపన్నహస్తం అందించకపోతారా..! అని ఆశగా ఎదురుచూస్తోంది. మెరుగైన వైద్య సేవలు అందించి కొంత కాలమైనా తన భర్తను కాపాడుకోవాలని ఆకాంక్షిస్తోంది. 


సమ్మయ్యతో తల్లి మధురమ్మ, కూతురు వైష్ణవి

నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్దోళ్లు ఇద్దరూ ఉన్నంతలో కష్టపడి బతుకుతున్నారు. చిన్న కొడుకు సమ్మయ్యకు క్యాన్సర్‌ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నాకు కడుపుకోత మిగిలేలా ఉంది. కొరివి పెడతాడనుకున్న చిన్న కొడుకు... ఇలా ఎముకల గూడై పోవడంతో.. ఇది చూసేందుకేనా నేను బతికి ఉన్నది అనిపిస్తోంది. చుట్టాలు, ఇంటి పక్కనోళ్లు చేతనైంత సాయం చేశారు. అయినా వాడి చికిత్సకు డబ్బులు చాలడం లేదు. పెద్ద మనసు చేసుకుని నా కొడుకును బతికించేందుకు ఆర్థిక సాయం చేయండి. ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారు. వారి పరిస్థితేంటో.. నా కోడలు బతుకు ఏమవుతుందో తెలుస్తలేదు- మధురమ్మ, సమ్మయ్య తల్లి

సమ్మయ్య కుటుంబానికి సహాయం చేయాలనుకున్న వారు: మొలుగూరి కవిత(మాతంగి శారద- పుట్టింట్లో పేరు)- అకౌంట్‌ నంబరు: 62333133861...ifsc: SBHY0020143లో డబ్బు జమచేయగలరు.
వివరాల కోసం: ఫోన్‌ నంబరు: 8897077534లో సంప్రదించగలరు.

మరిన్ని వార్తలు