స్పోర్ట్స్‌ సిటీగా కరీంనగర్‌

10 Jun, 2019 08:14 IST|Sakshi
స్టేడియం అభివృద్ధి నమూన పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న మేయర్‌ రవీందర్‌సింగ్‌

కరీంనగర్‌స్పోర్ట్స్‌: కరీంనగర్‌ స్మార్ట్‌సిటీలో నగరం నడిబొడ్డున్న అంబేద్కర్‌ స్టేడియం అభివృద్ధికి రూ.18 కోట్లు కేటాయించినట్లు మేయర్‌ రవీందర్‌సింగ్‌ తెలిపారు. ఈ నిధులతో స్టేడియంను స్పోర్ట్స్‌ సిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధికి సంబంధించిన నమూన పోస్టర్‌ను ఆవిస్కరించారు. అనంతరం వివరాలను వెల్లడించారు. స్టేడియం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఉన్న మైదానలను తీసివేయకుండా వాటి రూపురేఖలు మారుస్తున్నట్లు వెల్లడించారు. వాకింగ్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేయడమే కాకుండా కొత్తగా సైక్లింగ్‌రింగ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్టేడియంకు  ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు షాపింగ్‌ కాంప్లె„Šక్స్‌ నిర్మిస్తామన్నారు.

ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తామని తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీతోపాటు స్పోర్ట్స్‌ సిటీగా, హెల్తీ సిటీగా మార్చడమే లక్ష్యమన్నారు. క్రీడారంగంలో జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఎంతో కృషి చేశారని తెలిపారు. క్రీడలంటే అందరికీ హైదరాబాద్‌ గుర్తుకువస్తుందని, అంబేద్కర్‌ స్టేడియం అభివృద్ధి తర్వాత అందరూ కరీంనర్‌వైపు చూస్తార పేర్కొన్నారు. స్మార్ట్‌ స్టేడియాన్ని కరీంనగర్‌ ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. ఏడాదిలోగా టెండర్‌ పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్టేడియం చుట్టూ ఉన్న రహదారులను సైతం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 11న స్మార్ట్‌ స్టేడియం పనులను జిల్లా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ప్రారంభిస్తారని వివరించారు. సమావేశంలో కార్పొరేటర్‌ ఎల్‌.రూప్‌సింగ్, ఇన్‌చార్జి డీవైఎస్‌వో నాగిరెడ్డి సిద్దారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు