స్వచ్ఛత సమరం

17 Nov, 2018 08:07 IST|Sakshi
చెత్తను తొలగిస్తున్న కార్మికుడు, వర్మీ కంపోస్టుయార్డు

కరీంనగర్‌కార్పొరేషన్‌: పరిశుభ్ర భారతావని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కరీంనగర్‌ నగరపాలక సంస్థ స్వచ్ఛత సమరం చేపట్టింది. దేశ వ్యాప్తంగా స్వచ్ఛతపై జరుగుతున్న పోటీలో పదిలోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. పరిశుభ్ర నగరాలను గుర్తించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 పేరుతో పారిశుధ్యంపై సర్వే చేపట్టి ర్యాంకులు నిర్వహించనుంది. కేంద్ర బృందం సర్వేలో ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్లు, తడి, పొడి చెత్త వేరుచేయడం, జనావాసాల్లో చెత్త వేయడం, పబ్లిక్‌ టాయిలెట్లు, డంప్‌యార్డులు, నగర పరిశుభ్రతపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. నగరంలో పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛభారత్‌ అమలు సక్రమంగా ఉంటేనే మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. 

కరీంనగర్‌కార్పొరేషన్‌: 2015వ సంవత్సరంలో క్లీన్‌సిటీగా గుర్తించబడ్డ కరీంనగర్‌ నగరపాలక సంస్థ 2016లో 259వ ర్యాంకు, 2017లో 201వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అయితే.. 2018లో 4,041 నగరాలు స్వచ్ఛత ర్యాంకు కోసం పోటీపడగా 73వ ర్యాంకు సాధించి దేశ వ్యాప్తంగా కరీంనగర్‌ ఖ్యాతిని చాటిచెప్పింది. ఈ ఏడాది సైతం పోటీ తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. నగర పాలక సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న 10లోపు ర్యాంకు సాధించాలంటే తీవ్రంగా శ్రమించాలనే ఉద్దేశంతోనే ముందుకు కదులుతున్నారు. అయితే.. వాడవాడలా ఇంటింటికీ స్వచ్ఛతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మహిళా సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, బేకరీలు, ఇతర వ్యాపారులకు స్వచ్ఛత ఆవశ్యకతను తెలుపుతూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తే మంచి ఫలితం సాధించే అవకాశాలు ఉన్నాయి.

పారిశుధ్యం మెరుగుపడాలి..
నగరంలోని 50 డివిజన్లలో 62 వేల నివాస గృహాలుండగా, సుమారు 72 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 200 టన్నుల చెత్త వెలువడుతోంది. అయితే.. చెత్తసేకరణ నుంచి డంపింగ్‌ వరకు అన్నీ అవాంతరాలే ఏర్పడుతున్నాయి. స్వచ్ఛభారత్‌ ఇచ్చిన మార్కులు సాధించాలంటే తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ జరగాల్సి ఉంది. మురుగు కాలువల శుభ్రత రెగ్యులర్‌గా లేకపోవడం, పూడికను వెంటవెంటనే తొలగించకపోవడం, డంపింగ్‌ యార్డులో చెత్త పేరుకుపోవడం వంటి అంశాలు పోటీలో ఇబ్బంది పెట్టనున్నాయి. దీనికితోడు వీధుల్లో చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. ఇదంతా మార్కులపై ప్రభావం చూపనుంది.

ప్రజల భాగస్వామ్యంతోనే..
నగరపాలక ఆధ్వర్యంలో అమలు చేస్తున్న విధానాలపై నగరవాసులు అవగాహన పెంచుకుంటే పరిశుభ్రత కష్టమేమీ కాదు. ఇంట్లోని చెత్తను వేర్వేరు డబ్బాల్లో నిల్వ చేసి పారిశుధ్య కార్మికులకు అప్పగించడం, తడి చెత్తను మురుగుకాల్వల్లో పడేయకుండా ఉంటే చాలు. దీంతో పందుల సంచారం, దుర్వాసన పూర్తిగా దూరమవుతుంది. అప్పుడే స్వచ్ఛ నగరంగా రూపుదిద్దుకుంటుంది.

వంద రోజుల ప్రణాళిక..
కరీంనగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్ది స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019లో మంచి ర్యాంకు సాధించాలంటే గతంలో కంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్‌లో పరిగణలోకి తీసుకునే తడి, పొడి చెత్త వేరు చేయడం, డీఆర్‌సీసీల మెయింటెనెన్స్, ఓడిఎఫ్, పబ్లిక్, కమ్యూనిటీ, షీ టాయిలెట్స్‌ శుద్ధి, తడి–పొడి చెత్తపై అవగాహన, శానిటేషన్‌ వాహనాల మెయింటెనెన్స్, వర్మికంపోస్టుల ఏర్పాటు, వాహనాల మెయింటెనెన్స్, డంప్‌యార్డు నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించారు. వంద రోజుల్లో వీటన్నింటిపై పట్టు సాధిస్తేనే స్వచ్ఛసర్వేక్షణ్‌లో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. 

10 లోపు ర్యాంకే లక్ష్యం..
కరీంనగర్‌ నగరపాలక సంస్థ గతంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ చాలెంజ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే 2019లో 10లోపు ర్యాంకు సాధించేందుకు ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కసరత్తు చేస్తున్నాం. ఫలితాన్ని రాబట్టేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. – రవీందర్‌సింగ్, మేయర్‌

మరిన్ని వార్తలు