దళారులకు కేరాఫ్‌ రవాణాశాఖ !

17 Aug, 2019 08:16 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : అవినీతి, అక్రమాలకు రవాణా శాఖ కార్యాలయం నిలయంగా మారింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలుకొని వాహనాల రిజిస్ట్రేషన్‌ వరకు ఇక్కడికి వచ్చే సామాన్యులు దళారుల ద్వారానే పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజీవ్‌ రహదారి వంటి స్టేట్‌హైవేతోపాటు ఆదిలాబాద్, వరంగల్, మెదక్‌ ఉమ్మడి జిల్లాలకు అనుసంధానంగా ఉన్న తిమ్మాపూర్‌లోని కరీంనగర్‌ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్లదే పెత్తనం. అధికారులు, దళారులతో కుమ్మక్కై లక్షలు దండుకుంటున్నారు.

ప్రతిరోజు దాదాపు 70వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయంలో రవాణాశాఖ అధికారులు ‘లెక్కలు’ చూసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పునర్విభజన తరువాత పాత కరీంనగర్‌ నాలుగు కొత్త్త జిల్లాలుగా ఏర్పాటు కావడంతో పనిచేసే అధికారులు, సిబ్బందితోపాటు ఏజెంట్లు కూడా కొత్త జిల్లాలను పంచుకున్నారు. అయినా.. రిజిస్టేషన్ల సంఖ్యతోపాటు ఆదాయంలో కూడా కరీంనగర్‌ జిల్లానే టాప్‌గా నిలిచింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కరీంనగర్‌ జిల్లా హోదాకు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి(డీటీసీ)ని నియమించాల్సి ఉన్నప్పటికీ, ఆరేళ్లుగా ఇన్‌చార్జిల పాలనే సాగుతుండడంతో అధికారులు, సిబ్బందిపై నిఘా లేకుండా పోయింది. దారుణం ఏంటంటే ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాకు డీటీసీని నియమించి కరీంనగర్‌కు ఆయనను ఇన్‌చార్జిగా నియమించడం.

జిల్లాలో ఒకే ఒక్కడుగా కొనసాగిన అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌పాషా ఇటీవలే అవినీతి ఆరోపణలపై కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ అయ్యారు. వాహనాలను తనిఖీ చేయడం ద్వారా లక్షలు వసూళ్లు చేసిన సదరు అధికారి తాజాగా ‘గూగుల్‌ పే’ వంటి అధునాతన ఆన్‌లైన్‌ లావాదేవీలను కూడా ఉపయోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సహాయ ఎంవీఐ ఒక్కరే మిగిలారు. సిబ్బంది పాత్ర షరా మామూలే. ఏజెంట్ల నుంచి వచ్చిన కాగితాలే ఫైనల్‌ అనే చందంగా రవాణాశాఖ కార్యాలయంలో ప్రస్తుత ధోరణి నెలకొంది. లైసెన్సుల మంజూరు నుంచి వాహనాల తనిఖీ వరకు అంతటా డబ్బులే రాజ్యమేలుతున్నాయి. 

ఇన్‌చార్జి అధికారులే ఇక్కడ..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో గానీ, విభజన తరువాత కరీంనగర్‌లో గానీ రెగ్యులర్‌ ఆర్టీవో/డీటీసీలు లేరు. 2012 నుంచి 2014 వరకు దుర్గా ప్రమీల ఆర్టీవోగా పనిచేశారు. కరీంనగర్‌కు ఈమెనే రెగ్యులర్‌ ఆర్‌టీవోగా పనిచేసిన చివరి అధికారి. ఆ తర్వాత వచ్చినవారంతా ఇన్‌చార్జీలే. 2014–17 వరకు వినోద్‌కుమార్‌ ఇన్‌చార్జి డీటీసీగా కొనసాగారు. ఆయన తరువాత 2017 నుంచి 2018 వరకు కొండల్‌రావు, 2018 నుంచి 2019 వరకు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రస్తుతం శ్రీనివాస్‌ ఇన్‌చార్జి అధికారులుగానే ఉన్నారు. మొన్నటి వరకు ఇద్దరు రెగ్యులర్‌ ఏఎంవీఐలు ఉండగా, ఇటీవల ఏఎంవీఐ గౌస్‌పాషా గూగుల్‌ పే ద్వారా రూ.5 వేలు లంచం తీసుకోవడంతో అతడిని రవాణాశాఖ కమిషనర్‌కే సరెండర్‌ చేశారు. ప్రస్తుతం రజినీదేవి ఒక్కరే ఇక్కడ రెగ్యులర్‌ అధికారి. గౌస్‌పాషా సరెండర్‌ తర్వాత పెద్దపల్లి రవాణా శాఖ కార్యాలయం నుంచి ఫారూఖ్‌ను తాత్కాలికంగా కరీంనగర్‌కు ఏఎంవీఐగా నియమించారు. 

లంచాల కోసం పీడింపు..
కరీంనగర్‌ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చేవారికి లర్నింగ్‌ లైసెన్స్‌ నుంచే లంచాల బెడద మొదలవుతుంది. లెర్నింగ్‌ తరువాత రెగ్యులర్‌ లైసెన్స్, వాహనాల రోడ్‌ టాక్స్, ఫిట్‌నెస్‌ వరకు రూ.వేలల్లో లంచాలు దండుకుంటున్నారు. రూ.450 లెర్నింగ్‌ ఫీజకు రూ.600, రూ.2,000 పర్మినెంట్‌ లైసెన్స్‌కు రూ.6 వేలు, రిజిస్టేషన్‌కు ఫీజు కాకుండా ద్విచక్రవాహనాలకు రూ.300, ఫోర్‌ వీలర్స్‌కు రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ పరీక్షకు వచ్చే వాహనాలను వివిధ కారణాలు సాకుగా చూపి వేలాది రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. వాహనాల తనిఖీ పేరిట జరిగే తతంగం పూర్తిగా లంచాల వసూళ్లకేనని ఇటీవల ఎంవీఐ సరెండర్‌తో జిల్లా వాసులకు తెలిసిపోయింది. విద్యాసంస్థలకు చెందిన బస్సుల ఫిట్‌నెస్, లారీలు, ట్రక్కుల పన్ను వసూళ్లు, ఓవర్‌ లోడింగ్‌ తదితర విషయాల్లో రవాణా శాఖ సిబ్బంది మామూళ్ల పర్వం అగ్రభాగానికి వెళ్లిపోయింది.

అంతా ఏజెంట్లదే.. 
రవాణాశాఖ కార్యాలయంలో సుమారు 15 మంది ఏజెంట్లు రాజ్యమేలుతన్నారు. కార్యాలయం తెరవకముందే ఏజెంట్లు తిష్టవేస్తారు. అప్పటికే అక్కడకు వచ్చిన వాహనదారులతో, లైసెన్సుల కోసం వచ్చే వారితో బేరాలు మాట్లాడుకోవడం, తమను కాదని వెళితే లైసెన్స్‌ గానీ, వాహనం రిజిస్ట్రేషన్‌ గానీ కాదని హెచ్చరించి మరీ రోజువారీ సెటిల్‌మెంట్లు చేసుకుంటారు. అధికారులు 10:30 నుంచి 11 : 30 గంటల సమయంలోనే కార్యాలయానికి రావడం సర్వసాధారణమైంది.  అప్పటికే ఆ రోజు ఇచ్చే లైసెన్సులు, చేసే రిజిస్ట్రేషన్లు, ఇచ్చే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లకు సంబంధించి సెట్‌ చేసే ఏజెంట్లు అధికారులు రాగానే వారి గదుల్లోకి నేరుగా వెళ్లి మరీ, కమీషన్‌ ముట్టజెప్పి పనికానిచ్చేస్తారు. కార్లు, ట్రక్కులు, ఇతర పెద్ద వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిగా ఏజెంట్ల ద్వారానే సాగుతుండగా, డ్రైవింగ్‌ లైసెన్సులకు కూడా ఏజెంట్లే తప్పనిసరిగా మారిందనే విమర్శలున్నాయి. 

పంపకాల్లో అటెండర్‌ నుంచి అధికారి వరకు...
ఏజెంట్‌ ఇచ్చే మామూళ్లు కార్యాలయంలో పని చేసే అటెండర్‌ నుంచి కార్యాలయంలోని అసలు బాస్‌ వరకు అందరికీ ముడతాయనేది బహిరంగ రహస్యం. కార్యాలయానికి వచ్చిన వారి తో మాట్లాడుకున్న బేరం ప్రకారం ఏజెంట్ల నుంచి వెళ్లిన పత్రాలను పరిశీలించి, ఏజెంట్ల నుంచి వచ్చిన వాటికే ఆమోదముద్ర తెలపడం, మిగతా దరఖాస్తులకు కొర్రీలు విధించడం సా ధారణంగా మారింది. ఫైల్‌పై కోడ్‌భాషలో ఇచ్చే ఇండికేషన్‌ అధికారులు గమనించి, సంతకాలు చేస్తారు. ఈ నేపథ్యంలో నేరుగా వెళ్లినా పని కా దని నిర్ణయానికి వచ్చిన వారు తిరిగి ఏజెంట్లనే నమ్ముకోవడం సర్వసాధారణంగా మారింది. 

జిరాక్స్‌ సెంటర్లే అడ్డా..
జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లు అడ్డాగా చేసుకుని ఏజెంట్లు దందా నడిపిస్తున్నారు. ఇంటర్నెట్‌ సెంటర్ల సిబ్బంది కొంతమంది ఏజెంట్లతో కుమ్మక్కై బే రం మాట్లాడుతున్నారు. వచ్చిన దాంట్లో పంచుకోవడం మామూలుగా మారింది. బేరం రాగానే వారి ఏజెంట్‌కు సమాచారం అందించడంతోపాటు స్లాట్‌బుక్‌ చేయడం.. నుంచి సర్టిఫికెట్‌ జారీ చేసే వరకు అంతా వారిదే రాజ్యం.  

మరిన్ని వార్తలు