సమరానికి సై..

19 Mar, 2019 16:13 IST|Sakshi
నామినేషన్‌ దాఖలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థి వినోద్‌కుమార్‌

నామినేషన్‌ దాఖలు చేసిన కరీంనగర్‌ సిట్టింగ్‌ ఎంపీ వినోద్‌ 

కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌ ఖరారు

బండి సంజయ్‌కే బీజేపీ టికెట్‌ దక్కే అవకాశం

పెద్దపల్లిలో టీఆర్‌ఎస్‌ సీటు కోసం పెరిగిన పోటీ 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు గడువు ఉంది. ఈ మేరకు కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలిరోజైన సోమవారం కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు అందజేశారు. అలాగే, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా చింతల అనిల్‌ కుమార్‌ సైతం నామినేషన్‌ దాఖలు చేశారు.

ఇక పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ రిటర్నింగ్‌ అధికారిగా కలెక్టర్‌ శ్రీదేవసేన వ్యవహరిస్తుండగా.. ప్రజాబంధు పార్టీ నుంచి తాడెం రాజప్రకాశ్, ఇండిపెండెంట్‌గా కొయ్యడ స్వామి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశముండగా.. 26న నామినేషన్‌ పత్రాల పరిశీలన అనంతరం 27, 28వ తేదీల్లో ఉప సంహరణకు గడువు ఉంది. ఇక ఏప్రిల్‌ 11వ తేదీన పోలింగ్‌ జరగనుంది. 


కరీంనగర్‌ అభ్యర్థులపై స్పష్టత
కరీంనగర్‌లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత లభించింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌ను ఇప్పటికే ప్రకటించగా, మంచిరోజు చూసుకుని ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. బీజేపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గట్టిపోటీ ఇచ్చిన బండి సంజయ్‌కే అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సీటు కోసం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ పేర్లు కూడా ఢిల్లీ కేంద్ర కమిటీకి చేరుకున్నప్పటికీ, బండి సంజయ్‌ పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. అయితే గోవా ముఖ్యమంత్రి పారికర్‌ మరణంతో సోమవారం ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితా వాయిదా పడింది.


తేలని పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి
పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ పేరు ఖరారైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విషయంలో పార్టీ అధినేత కేసీఆర్‌ ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఇక్కడ మారిన సమీకరణాల నేపథ్యంలో ఎస్సీల్లో ఏ ఉప కులానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలనే విషయంలో స్పష్టత రావడం లేదు. మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, అదే స్థాయిలో ఆయన వ్యతిరేక వర్గం కూడా తమ వంతు యత్నాల్లో మునిగిపోయి కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. వివేక్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతకాని వర్గానికి పెద్దపల్లి సీటు కేటాయించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.

గత ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బొర్లకుంట వెంకటేష్‌ నేత పేరును ఆయన ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే స్థానిక మంత్రులను కలిసిన ఆయన తాజాగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావుకు విజ్ఞప్తి చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కూడా అందుకు అభ్యంతరం పెట్టడం లేదని తెలిసింది. కాగా తాజాగా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్‌ టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ టికెట్‌ను మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు ఇచ్చినందుకు నిరసనగా ఆయన గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరెపల్లి మోహన్‌కు సీటిస్తే గెలుపు తథ్యమని టీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుండగా.. అభ్యర్థిపై స్పష్టత రాలేదు. 

టీఆర్‌ఎస్‌ ప్రకటించాకే బీజేపీ 

టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే బీజేపీ పెద్దపల్లి అభ్యర్థిని ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా సీటు దక్కకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఒకరిద్దరు ముఖ్య నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నిర్ణయం కోసం బీజేపీ వేచి చూస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో గోదావరిఖనికి చెందిన ఎస్‌.కుమార్‌ పేరును పార్టీ దాదాపుగా ఖరారు చేసినా.. టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతల కోసం వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కాసిపేట లింగయ్య, కొయ్యల ఏమాజీ కూడా టికెట్‌ ఆశిస్తుండడం గమనార్హం. కాగా పెద్దపల్లి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్‌ పేరును ఖరారు చేయడంతో పార్టీలో వ్యతిరేకత పెరుగుతోంది.  

మరిన్ని వార్తలు