రైతులంటే ఇంత అలుసా..? 

17 Feb, 2019 10:01 IST|Sakshi
జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ దేవసేన

రైతులంటే ఇంత అలుసా... ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు విడతల రైతుబంధు పథకం పూర్తయింది... తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది... అయినా ఇంతవరకు జిల్లాలో అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదు... దీంతో రైతుబంధు పథకంతో పాటు రైతుబీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది... వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు నిర్లిప్తత వీడాలి...? అంటూ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యులు డిమాండ్‌ చేశారు.

శనివారం జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన, కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్, జగిత్యాల జాయింట్‌ కలెక్టర్‌ రాజేశం, జయశంకర్‌భూపాలపల్లి జాయింట్‌ కలెక్టర్‌ స్వర్ణలత, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావుతో పాటు ఏడు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మొదటగా ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమరజవాన్ల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. హుస్నాబాద్, చొప్పదండి, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీలు రాయిరెడ్డి రాజిరెడ్డి, ఇప్పనపల్లి సాంబయ్య, తోట ఆగయ్య ఆమరజవాన్లకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం వివిధ శాఖల పనితీరు, పథకాల అమలుపై చర్చ జరిగింది.

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రైతు సమస్యలపై సభ్యులు సంబంధిత అధికారులను నిలదీశారు. బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యులు తన్నీరు శరత్‌రావు మాట్లాడుతూ..రైతుబంధు,రైతుబీమాకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి మాట్లాడుతూ మహాముత్తారం, మహాదేవపూర్, కాటారం మం డలాల్లో 70 శాతానికిపైగా భూరికార్డులు సరిగ్గా లేవని ఆరోపించారు. ముస్తాబాద్‌ జెడ్పీటీసీ సభ్యులు శరత్‌రావు మాట్లాడుతూ మండలంలో 700మందికిపైగా రైతులకు పాసుపుస్తకాలు అందలేదన్నారు.

మానకొండూర్, బోయిన్‌పల్లి, శంకరపట్నం జెడ్పీటీసీలు ఎడ్ల సుగుణాకర్, లచ్చిరెడ్డి, సంజీవరెడ్డి మాట్లాడుతూ ఆత్మ పథకంపై అవగాహన సమావేశాలు పెట్టడం లేదని మండిపడ్డారు. రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత మాట్లాడుతూ గుండి గ్రామంలో సిలివేరి సత్తయ్య అనే రైతు మరణించాడని పాస్‌బుక్‌ లేకపోవడంతో రైతుబంధు పథకానికి నోచుకోలేకపోయాడని ఇలాంటి ఘటనలు కొకొల్లాలుఅని సభదృష్టికి తెచ్చారు. వేములవాడ జెడ్పీటీసీ శ్రీకాంత్‌ మాట్లాడుతూ తనకు చెందిన భూమికి సంబంధించి రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదని అన్నారు. మల్యాల జెడ్పీటీసీ శోభరాణి మాట్లాడుతూ బల్వంతపూర్‌ గ్రామంలో రైతు మరణిస్తే అర్హతలు ఉన్న రైతుబంధు చెక్కు ఇవ్వడంలో వ్యవసాయ శాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారని సభదృష్టికి తెచ్చారు.

‘మిషన్‌భగీరథ’పనులపై అసంతృప్తి... 
మిషన్‌ భగీరథ పథకం పనులపై సభ్యులు మండిపడ్డారు. ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్దం వేణు, ఎంపీపీ అయిలయ్యలు మాట్లాడుతూ గ్రామాల్లో మిషన్‌ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇప్పటి వరకు ఎన్ని ట్యాం కులు నిర్మించారు...ఎక్కడెక్కడ పైపులు వేశారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. మిషన్‌ భగీరథ పనుల వల్ల రోడ్లన్ని అస్థవ్యస్థంగా తయారవుతున్నాయని, పైపులు వేసిన చోట గుంతలు పూడ్చటం లేదని ఒకే కాంట్రాక్టర్‌ ఎక్కువ మొత్తంలో ట్యాంకులను కాంట్రాక్ట్‌ తీసుకోవడం వల్ల పనుల్లో వేగం తగ్గిందని కాంట్రాక్టర్ల తీరుపై పలువురు సభ్యులు ధ్వజమెత్తారు.

విద్యశాఖ తీరుపై ఆసక్తికర చర్చ... 
విద్యశాఖలో సమస్యలను ప్రతి సమావేశంలో విన్నవిస్తున్నా పరిష్కారానికి మోక్షం లభించడం లేదని సభ్యులు ఆసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ ఎంపీపీ వాసాల రమేష్‌ మాట్లాడుతూ.. కొత్తపల్లి మండల కేంద్రంలో వ్యాయమా ఉపాధ్యాయుడు విద్యాసాగర్‌ 18 ఏళ్లుగా ఒకేస్కూల్‌లో పనిచేస్తున్నాడని, తనకున్న పలుకుబడితో విధులు నిర్వహించకుండా రాజకీయాలకే పరిమితమవుతున్నాడని ఆరోపించారు. మహాముత్తారం జెడ్పీటీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అటెండర్లు, స్వీపర్ల పోస్టులను భర్తీ చేయాలని , ప్రహరీ గోడలు ,అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.

ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ తోట ఆగయ్య మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని గత ఘటన ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. డీఈవో వెంకటేశ్వర్ల మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య అందిస్తున్నామని సమాధానం ఇవ్వబోతుండుగా.. జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు రాయిరెడ్డి రాజిరెడ్డి అడ్డుపడి కొడిమ్యాల మండల కేంద్రంలో గత సంవత్సరం ఎస్‌ఎస్‌సీ పరీక్షల సందర్భంగా జరిగిన మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారంలో పది మందిని తిరిగి విధుల్లోకి తీసుకుని ఒక్కరికి పోస్టింగ్‌ ఎందుకు ఇవ్వడం లేదని డీఈవోను ప్రశ్నించారు. ఆ ఉపాధ్యాయుడి పరిధి మోడల్‌ స్కూల్‌ సొసైటీలో ఉందని డీఈవో సమాధానం ఇచ్చారు. మల్యాల ఎంపీపీ శ్రీలత, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌ , మంథని జడ్పీటీసీ సరోజన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకపఠనంపై ఆసక్తి కలిగించాలని సభ దృష్టికి తెచ్చారు.
 
వైద్య శాఖ పై గరంగరం... 
జిల్లాలో వైద్యశాఖ తీరు మారడం లేదని, ప్రతి సమావేశంలో చెప్పిన విషయాలను చెప్పడమే తప్ప సమస్యలకు మోక్షం లభించడం లేదని వైద్యశాఖ అధికారుల తీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో పోస్టుమార్టం భవనం పూర్తయిన ప్రారంభానికి ఎందుకు ఆలస్యం జరుగుతుందని కో ఆప్షన్‌ సభ్యులు జమీలోద్దీన్‌తో పాటు తదితరులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. పోస్టుమార్టం భవనానికి దారి లేదనే నెపంతో వాయిదా వేయడం తగదని, కేవలం ప్రహరీ గోడ కూల్చేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రైవేట్‌ ఆసుపత్రి నిర్వహకుల ఒత్తిళ్లకు తలొగ్గడం విచారకరమని సభ్యులు మండిపడ్డారు. కాటారం మండల కేంద్రంలో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయాలని, మంథని ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్టు డాక్టర్‌ను నియమించాలని చల్లా నారాయణరెడ్డి సభ దృష్టికి తెచ్చారు.

ఐసీడీఎస్‌ అవినీతిపై మల్యాల జెడ్పీటీసీ బైఠాయింపు... 
జగిత్యాల జిల్లాలో మహిళ శిశు సంక్షేమ శాఖ అవినీతికి అడ్డుఅదుపు లేకుండా పోయిందని, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పౌష్టికాహారం, పాలు,గుడ్లు వంటి వాటిలో రెండున్నర కోట్ల కుంభకోణం జరిగిందని రెండేళ్లుగా పత్రికలు కోడైకూస్తున్నా చర్యలు లేవని మల్యాల జెడ్పీటీసీ శోభారాణి అధికారుల తీరుపై మండిపడ్డారు. దీంతో జగిత్యాల జిల్లా అధికారులు ఎవరూ సమావేశంలో లేకపోవడంతో అధికారులు వచ్చి సమాధానం ఇచ్చేంత వరకు నేలపై కూర్చుంటానని చెబుతూ సమావేశం పోడియం ముందు బైఠాయించారు. దీంతో జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ జోక్యం చేసుకోని సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని, అవినీతి ఆరోపణల విషయంపై ప్రభుత్వానికి నివేదిస్తా మని చెప్పడంతో శోభారాణి శాంతించారు. 

15రోజుల్లో పాసుపుస్తకాలు అందజేస్తాం 
15 రోజుల్లో అర్హత గల రైతులందరికి పాసుపుస్తకాలు అందజేస్తాం. మిగిలిన చోట్ల భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. 2వేల పాసుపుస్తకాలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. అర్హత గల రైతులందరికీ పాసుపుస్తకాలతో పాటు రైతుబంధు, రైతుభీమా పథకం అందుతుంది. – శ్యాంప్రసాద్‌లాల్, కరీంనగర్‌ జాయింట్‌ కలెక్టర్‌ 

మార్చి 31లోగా ఇంటింటికీ నీరు 
పెద్దపల్లి జిల్లాలోని అన్ని గ్రామాలకు మార్చి 31లోపు మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నీరు అందిస్తాం. అందుకు పూర్తి ఏర్పాట్లు చేశాం. పైపుల కోసం వేసిన గుంతలు పూడ్చే బాధ్యత కాంట్రాక్టర్లదే. దేశంలో పంజాబ్‌ రాష్ట్రం 70 శాతం ఇంటింటికి నల్లానీరు అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వందశాతం భగీరథ నీళ్లు ఇంటింటికి అందజేస్తుంది. – శ్రీదేవసేన, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌  

బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి 
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులది అంతే బాధ్యత ఉంటుంది. సమావేశాలకు అధికారులు జవాబుదారీతనంతో పాటు సమగ్ర నివేదికలతో రావాలి. ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా అధికారులు వ్యవహరించడం సరికాదు. – తుల ఉమ, జెడ్పీ చైర్‌పర్సన్‌

మరిన్ని వార్తలు