పాలమూరు, డిండిలపై తీరు మార్చుకోని కర్ణాటక

4 Oct, 2019 02:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ఎగువ కృష్ణా బేసిన్‌లో ఉన్న కర్ణాటక తన తీరు మార్చుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అడ్డుపుల్లలు వేయాలన్న లక్ష్యంతో గట్టిగా తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇటీవలే జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో దీనిపై తెలంగాణ కొంత స్పష్టతనిచ్చినా మళ్లీ కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. కృష్ణా బేసిన్‌లో నదీ జలాల నీటి లభ్యత ప్రాతిపదికన అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా, కృష్ణా జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ కానీ, ఏపీ కానీ ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టరాదని పునర్విభజన చట్టంలో ఉందని జలశక్తి శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. కొత్త ప్రాజెక్టులు ఏవైనా చేపడితే ప్రాథమికంగా సాంకేతిక అనుమతులను కృష్ణాబోర్డు నుంచి తీసుకోవాలని, అనంతరం అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు పొందాలని పేర్కొంది.

దీంతో పాటే కృష్ణా బేసిన్‌లో మిగులు జలాలపై హక్కులు కేవలం దిగువ రాష్ట్రాలకే ఉంటాయని, ఎగువ రాష్ట్రాలకు ఉండవంది.  తెలంగాణ ఎగువ రాష్ట్రం అయినందున మిగులు జలాలపై హక్కులు లేవని తెలిపింది. కర్ణాటక ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ దీనిపై వివరణ తీసుకోవాలంటూ కృష్ణాబోర్డుకు రెండు రోజుల కిందట లేఖ రాసింది. దీంతో ప్రాజెక్టులపై స్పందించాలని బోర్డు గురువారం తెలంగాణకు లేఖ రాసింది. ప్రాజెక్టు డీపీఆర్, ప్రస్తుత ప్రాజెక్టు స్థితిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఇటీవలే చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలోనే ఈ ప్రాజెక్టులపై తెలంగాణ స్పష్టతనిచ్చింది. ఈ 2 ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టారని చెప్పింది. మిగులు జలాల్లో తమకు హక్కు ఉంటుందని వివరించింది. అయినప్పటికీ కర్ణాటక తన వైఖరి మార్చుకోవడంలేదు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా