‘పాలమూరు’పై కర్ణాటక పేచీ

27 Sep, 2019 02:54 IST|Sakshi

పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను ఎలా చేపడతారంటూ కొర్రీలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై కర్ణాటక పేచీకి దిగుతోంది. కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు ఇప్పటికే ఫిర్యాదు చేసిన కర్ణాటక, తాజాగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం చెన్నైలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌లో దీనిపై చర్చించాలని డిమాండ్‌ చేసింది. కర్ణాటక ఫిర్యాదు పై స్పందించిన హోంశాఖ అంతర్రాష్ట్ర వ్యవహారాల కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ దీనిపై చర్చించేందుకు అనుమతిస్తూనే, దీనిపై వివరణ కోరింది.  

మిగులును చూపించి చర్చకు.. 
‘కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌–2 నవంబర్‌ 29, 2013న ఇచ్చిన తుది ఉత్తర్వుల ప్రకారం మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణకు ఇవ్వలేదు. సముద్రంలోకి వృథాగా వెళ్లే మిగులు జలాలను దిగువ రాష్ట్రంగా వాడుకునే హక్కును ట్రిబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. అదే సమయంలో ఎగువ రాష్ట్రా లైన కర్ణాటక, మహారాష్ట్రకు మిగులు జలాలు వాడుకునే హక్కులు ఇవ్వలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం సైతం ఎగువ రాష్ట్రమైనందున దానికి సైతం మిగులు జలాలు వాడుకునే హక్కు లేదు’అని కర్ణాటక తెలిపింది. ఈ దృష్ట్యా మిగులు జలాలపై ఆధారపడి పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టరాదని కేంద్రానికి తెలిపింది.

మరిన్ని వార్తలు