నేడు ఎమ్మెల్సీగా ‘కర్నె’ ప్రమాణ స్వీకారం

21 Aug, 2014 02:38 IST|Sakshi
నేడు ఎమ్మెల్సీగా ‘కర్నె’ ప్రమాణ స్వీకారం

 సంస్థాన్ నారాయణపురం :టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ ఎమ్మెల్సీగా  రాజ్‌భవన్‌లో గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్నె ప్రభాకర్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కర్నె ప్రభాకర్ సొంతూరు సంస్థాన్ నారాయణపురం. ప్రభాకర్ తల్లిదండ్రులు జంగప్ప, శివలీల. వీరిది మధ్య తరగతి కుటుంబం. వీరికి ఐదుగురు సంతానం. వీరిలో చిన్న కుమారుడు కర్నె ప్రభాకర్. ఈయన పదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్నారు. భువనగిరిలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఇంటర్, ఎస్‌ఎల్‌ఎన్ ఎస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం జర్నలిజం కూడా చేశారు.
 
 సంస్థాన్‌నారాయణపురానికి చెందిన స్వాతిని వివాహమాడారు. ఈయనకు ముగ్గురు పిల్లలు. వీరిలో కూతుళ్లిద్దరూ కవలలు ఇందుశ్రీ, సింధుశ్రీ, కుమారుడు రవిచరణ్. కర్నె.. రాజకీయాల్లోకి రాకముందు పలుచోట్ల సూపర్‌వైజ ర్‌గా పనిచేశారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవి ర్భావంతో ఆ పార్టీలో చేరారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.  2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కర్నెకు తగిన న్యాయం చేస్తానని కేసీఆర్ ముందునుంచీ చెబుతూ వస్తున్నారు. అం దులో భాగంగా గవర్నర్ కోటాలో భర్తీ చేసే మూడో ఎమ్మెల్సీని కర్నె ప్రభాకర్‌కు కట్టబెడుతున్నట్టు స్వయంగా కేసీఆరే ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రమాణస్వీకారోత్సవానికి సంస్థాన్ నారాయణపురం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలనున్నారు.
 
 ‘సంస్థాన్’కు దక్కిన   ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు
 మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన ఇన్నేళ్లలో మొట్టమొదటి సారి సంస్థాన్‌నారాయణపురం మండలానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా మండలంలోని సర్వేల్ గ్రామపంచాయతీ పరిధిలోని లింగవారిగూడానికి చెందిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచారు. అలాగే సంస్థాన్‌నారాయణపురానికి చెందిన టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేసింది. మండలా చెందిన  ఇద్దరు వ్యక్తులు ఉన్నత స్థానాలలో ఉండటంతో సంస్థాన్ నారాయణపురం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు