టీఆర్‌ఎస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు 

17 Mar, 2019 19:23 IST|Sakshi
పట్లోళ్ల కార్తీక్‌ రెడ్డి

19న కారెక్కనున్న కాంగ్రెస్‌ నేత కార్తీక్‌రెడ్డి 

ఆయన వెంటే డీసీసీ, డీసీసీబీ మాజీ అధ్యక్షులు 

వెంకటస్వామి, లక్ష్మారెడ్డి 

శంషాబాద్‌ సభలో గులాబీ కండువా వేసుకోనున్న కార్తీక్‌   

రెండు రోజులు ఆలస్యంగా చేరనున్న సబితాఇంద్రారెడ్డి 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్‌ పార్టీ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్లోళ్ల కార్తీక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా వేసుకోనున్నారు. శంషాబాద్‌లోని క్లాసిక్‌ కన్వెన్షన్‌ మైదానంలో సాయంత్రం 6 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కార్తీక్‌రెడ్డి నిశ్చయించారు. ఇదే వేదికపై ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు కూడా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గులాబీ గూటికి చేరనున్నారు. వీరితోపాటు తమ వర్గంగా భావిస్తున్న పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పార్టీ మారనున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మంది టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఈ సభకు సమీకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కొంత ఆలస్యంగా సబిత.. 
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌ సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాలని తొలుత భావించారు. ఈ మేరకు చేవెళ్ల లేదా శంషాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేపటి నుంచి ప్రారంభించనుండటంతో.. సమయం వీలుకాదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తనకు బదులు కుమారుడు కేటీఆర్‌ను జిల్లాకు పంపిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్‌ సమక్షంలో కార్తీక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అయితే సబిత మాత్రం ఒకటి రెండు రోజులు ఆగనున్నట్లు తెలిసింది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు.  

మరిన్ని వార్తలు