అమ్మ కోసం కార్తీక్‌రెడ్డి సీటు త్యాగం!

20 Nov, 2018 09:08 IST|Sakshi
తల్లి సబితతో కార్తిక్‌ 

పోటీకి దూరంగా కార్తీక్‌రెడ్డి 

అప్పుడు తల్లి.. ఇప్పుడు తనయుడు సీటు త్యాగం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నాడు కుమారుడు ఎంపీగా పోటీ చేసేందుకు పెద్ద మనస్సు చేసుకొని పోటీకి దూరమైన అమ్మ.. నేడు తల్లి బరిలోకి దిగేందుకు వీలుగా తన సీటును త్యాగం చేసిన కుమారుడు. ఇలా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డిలు జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్‌ నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ ముందుకెళ్లగా.. కార్తీక్‌కు చేవెళ్ల ఎంపీగా పోటీకి లైన్‌క్లియర్‌ చేసేందుకు సబిత తన మహేశ్వరం సీటును త్యాగం చేశారు. ఇప్పుడు  మహేశ్వరం సెగ్మెంట్‌ను సబితకు కేటాయించగా.. కూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్‌ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కార్తీక్‌కు సీటు త్యాగం తప్పలేదు. 

పాత కథ పునరావృతం 
2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే మహేశ్వరం శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, కుటుంబానికి ఒకే టికెట్‌ అనే నిబంధనను కాంగ్రెస్‌ పార్టీ తెర మీదకు తేవడంతో తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం మహేశ్వరం సిట్టింగ్‌ స్థానాన్ని త్యజించారు. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కార్తీక్‌కు లభించింది.

ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన కార్తీక్‌కు పరాభవం ఎదురైంది. దీంతో కొద్ధిరోజుల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సబిత.. ఈ సారి పాత స్థానమైన మహేశ్వరం నుంచి, కార్తీక్‌ రాజేంద్రనగర్‌ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ రెండు స్థానాల టికెట్లు తమకు ఖాయమని భావించారు. అయితే, అనూహ్యంగా ఈ సారి కూడా ‘ఫ్యామిలీకి ఒకే టికెట్‌’ షరతును వర్తింపజేయాలని హైకమాండ్‌ నిర్ణయించడంతో కార్తీక్‌ నీరుగారారు.

అయితే, ఈ నిబంధన కార్యరూపం దాల్చదని చివరి నిమిషం వరకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ నెరిపారు. సొంత పార్టీని ఒప్పించడానికి సతమతమవుతున్న ఆయనకు మిత్రపక్షం రూపంలో చుక్కెదురైంది. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ ఈ స్థానాన్ని ఎగురేసుకుపోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో కుంగిపోయిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని చెప్పడమేగాకుండా.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే, మహేశ్వరంలో అమ్మ పోటీ చేస్తుండడంతో తన రాజీనామా ప్రభావం ఆమెపై పడకూడదని భావించారు. రాజీనామా నిర్ణయంపై వెనుకడుగువేశారు. దీంతో నాడు కార్తీక్‌ కోసం తల్లి సీటును త్యాగం చేయగా.. ఈ సారి తల్లి కోసం తనయుడు సీటును త్యజించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు