‘మహా’ సందడి..

24 Nov, 2018 07:16 IST|Sakshi
గోదారమ్మకు మహా హారతి సమర్పిస్తున్న అర్చకులు

భద్రాచలంటౌన్‌: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భద్రాద్రి భక్తజన సంద్రమైంది. శుక్రవారం తెల్లవారుజామునుంచే రామాలయానికి భక్తులు పోటెత్తారు. దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రికి పవిత్ర గోదావరి తీరాన పుణ్య(మహా) నదీ హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ధూప, నాగ, రుద్ర, సూర్య, నేత్ర, నంది, సింహ, చక్ర, కుంభ హారతులను గోదారమ్మకు సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవనాథ రామానుజ జీయర్‌ స్వామి మాట్లాడుతూ.. ప్రపంచదేశాలకు భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలే స్ఫూర్తి అని అన్నారు.

పురాణకాలం నుంచే భారతదేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, నేడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్నే అనుసరిస్తున్నాయని చెప్పారు. కాశీ క్షేత్రంలో నిర్వహించే మహా హారతి కార్యక్రమాన్ని దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామచంద్రస్వామి వారి సన్నిధిలోని గోదావరి తీరంలో నిర్వహించడం హర్షణీయమన్నారు.  మహా హారతి కార్యక్రమ వ్యవస్థాపకులు పి. మురళీధరరావు మాట్లాడుతూ నదులే జీవనాధారమని, అటువంటి నదులను పవిత్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.

భద్రాచలంలో నాలుగేళ్లుగా నిరాటంకంగా మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కాశీలోనే నిర్వహించే ఈ కార్యక్రమాన్ని భద్రాచలం ప్రజలు కూడా తిలకించే అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉందన్నారు.    కార్యక్రమంలో నిర్వాహకులు బూసిరెడ్డి శంకరరెడ్డి, ఐటీసీ పీఎస్‌పీడీ జనరల్‌ మేనేజర్‌ ప్రభోధ్‌కుమార్‌ పాత్రో, సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ అజయ్‌ రావత్, ఆర్టీసీ డీవీవీఎం శ్రీకృష్ణ, భద్రాచలం డీఎం నామా నర్సింహా, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌. వెంకటపుల్లయ్య, భద్రాచలం స్పెషల్‌ సబ్‌జైల్‌ సూపరింటెండెంట్‌ ఆనందరావు, ప్రముఖ వైద్యులు ఎస్‌ఎల్‌కాంతారావు, జీవీవీ సుదర్శనరావు, జయభారతి, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్, బీఎస్‌ఎస్‌ శర్మ, గోళ్ల భూపతిరావు, కృష్ణమోహన్, గాదె మాధవరెడ్డి, చారుగుళ్ల శ్రీనివాస్, గట్టు వెంకటాచార్యులు, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ భూక్యా శ్రీనివాస్, కడాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు