చెల్లీ.. నేనున్నా!

24 Jul, 2019 08:04 IST|Sakshi

కేజీబీవీల్లో ‘ఆత్మీయబంధం’ 

కొత్తగా చేరిన విద్యార్థినులకు సీనియర్ల తోడ్పాటు

వారిలో భయాందోళన పోగొట్టేందుకు చర్యలు

డ్రాపౌట్స్‌కు చెక్‌ పెట్టేలా కార్యక్రమం

నల్లగొండ : కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కొత్తగా చేరే విద్యార్థినుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ఆత్మీయ బంధం’ పేరుతో కస్తూరిబా పాఠశాల ప్రాజెక్టు డైరెక్టర్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తద్వారా కొత్తగా పాఠశాలలు, కళాశాలల్లో చేరే బాలికలను సీనియర్లు చెల్లీ.. నేనున్నా.. అంటూ అక్కున చేర్చుకోవడడంతో.. నూతన విద్యార్థినుల్లో భయం తొలగి.. ధైరంగా ఉండనున్నారు.

భయాందోళన పోగొట్టేలా..
జిల్లా వ్యాప్తంగా 27 కస్తూరిబా పాఠశాలలు ఉన్నాయి. వాటితోపాటు కళాశాలలు కూడా ఉన్నాయి. పాఠశాలల్లో దాదాపు 7 వేల నుంచి 8వేల వరకు విద్యార్థినులు ఉండగా, కళాశాలల్లో 600 నుంచి 700 మంది వరకు విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఏటా 6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో కూడా విద్యార్థినులు చేరుతారు. అప్పటి వరకు తల్లిదండ్రులు, బంధువుల వద్ద ఉంటూ ఒకేసారి హాస్టల్‌కు వచ్చేసరికి కొత్త వాతావరణం అనిపిస్తుంది. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వారు మారకపోవడం, సీనియర్ల నుంచి సహకారం లభించకపోవడంతో చాలామంది పిల్లలు మధ్యలోనే పాఠశాలలు వదిలి వెళ్తుంటారు. అయితే కొందరిని  తిరిగి పాఠశాలలకు రప్పించినా కొందరిని రప్పించలేని పరిస్థితి. దీనికి చెక్‌ పెట్టేందుకు ఈ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు.

ప్రతి కేజీబీవీలో ‘ఆత్మీయ బంధం’ 
ప్రతి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఆత్మీయ బంధం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉపాధ్యాయినులతో పాటు కస్తూరిబా అధికారులు, కొత్త, పాత విద్యార్థినులచేత ఈ ఆత్మీయ బంధం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా చేరిన విద్యార్థినులను సీనియర్లకు దత్తత ఇస్తున్నారు. సీనియర్లు వారితో ఎప్పుడూ కలిసి ఉంటారు. చదువుకునేటప్పుడు, భోజనం చేసే సందర్భంలో, ఆటలు ఆడుకునే సమయంలో వారితో నిత్యం మాట్లాడడం, వారిలో ఉన్నటువంటి భయాందోళనలు తొలగిస్తూ చెల్లీ నేను ఉన్నానంటూ భరోసానివ్వనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఆత్మీయ బంధం ఎంతో మేలు 
ఆత్మీయ బంధం కార్యక్రమం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. కొత్తగా పాఠశాలలు, కళాశాలల్లో చేరిన విద్యార్థినుల్లో భయాందోళనలు పోగొట్టేందుకు ఉపయోగపడుతుంది. ఇద్దరు సీనియర్లు, జూనియర్లు కలిసి ఉండడం వల్ల కొత్తదనం అనేది పోయి అక్కా చెల్లెళ్ల మాదిరిగా ఉండనున్నారు.  – అరుణ శ్రీ, సెక్టోరియల్‌అధికారి   

మరిన్ని వార్తలు