వార్‌ వన్‌సైడే..!

4 Apr, 2019 03:53 IST|Sakshi

నేను పాతాళంలో ఉన్నా వెతికి పట్టుకుని ఓటేస్తారని తెలుసు

 నా పనితీరు బాగుంటేమరోసారి గెలిపించండి 

జగిత్యాల రోడ్‌షోలోకవిత పిలుపు

సాక్షి, జగిత్యాల: ‘పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ స్థానంలో ఒకటికి బదులు 12 ఈవీఎంలతో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.. గెలుపు కూడా ప్రత్యేకంగా ఉండాలి’ అని నిజామాబాద్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత పిలుపునిచ్చారు. ఏ సభ చూసినా వార్‌ వన్‌ సైడ్‌లా కనిపిస్తోందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగం గా బుధవారం జగిత్యాలలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆమె మాట్లాడారు. ‘నేను పాతాళంలో ఉన్నా.. వెతికి పట్టుకుని ఓటేస్తారని నాకు తెలుసు.

అందుకే మిమ్మల్ని నమ్ముకుని వచ్చా ను. ఎంపీగా నా పనితీరు బాగుందనిపిస్తే నన్ను గెలిపించండి’ అని విజ్ఞప్తి చేశారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే ఢిల్లీలో కొట్లాడుతానని, గల్లీలో సేవ చేస్తానని పేర్కొన్నారు. దేశ చరిత్రను మలుపు తిప్పాలంటే మనపాత్ర ఉండా లని కోరారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చేసిం దేమీ లేదని కవిత విమర్శించారు. దేశంలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని, దేశం కూడా ముందుకు సాగాలంటే కాంగ్రెస్, బీజేపీని పక్కకు పెట్టాలని కోరారు. 29 రాష్ట్రా ల్లో 24 గంటల కరెంట్‌ ఉచితంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మనకు వచ్చినట్లు దేశమంతా కరెంట్‌ రావాలని చెప్పారు.  

16 సీట్లొస్తే తెలంగాణకు లాభం 
తెలంగాణ రాష్ట్ర మోడల్‌ అభివృద్ధి దేశంలో జరగాలంటే 16 సీట్లు టీఆర్‌ఎస్‌కు రావాలని, రేపు ఢిల్లీలో మన మాట చెల్లుబాటు అవుతుందని కవిత చెప్పారు. మట్టి పనికైనా మనోడు ఉండాలని, అలాంటిది తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలంటే గులాబీ జెండానే ఎగరాలన్నా రు. 12 మంది ఎంపీలం గెలిస్తే ప్రతి పనికి అందరం కట్టకట్టుకుని ఢిల్లీకి పోయి పనులను సాధించుకున్నామని చెప్పారు. 60 ఏళ్లలో ఎన్న డూ రానన్ని రైల్వే లైన్లు రాష్ట్రానికి వచ్చాయ న్నారు. బీజేపీకి సీట్లు వస్తే మోదీకే లాభం, కాంగ్రెస్‌కు సీట్లు వస్తే రాహుల్‌కు లాభం, టీఆర్‌ఎస్‌కు సీట్లు వస్తే రాష్ట్రానికి లాభం జరుగుతుందన్నారు. దేశంలోని 13 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే కేవలం తెలంగాణలో మాత్రమే వారికి పింఛన్‌ అందుతుందన్నారు. 

బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ 
బీజేపీ చేసింది తక్కువ, అబద్ధాలు ఎక్కువ అని  కవిత విమర్శించారు. ప్రధాని మోదీ నుంచి అభ్యర్థి వరకు అందరూ అబద్ధాలే మాట్లాడుతారని చెప్పారు. మోదీ నిజామాబాద్‌ వచ్చి ఇక్కడ కరెంట్‌ లేదు అంటే ఏడవాలో నవ్వాలో కూడ అర్థం కాలేదని అన్నారు. బీజేపీకి భారతీయ ఝూటా పార్టీ అని పేరు పెట్టామన్నారు.    

కాంగ్రెస్‌కు విజన్‌ లేదు.. 
బీజేపీ సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలను ప్రచారం చేస్తోందని కవిత మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇచ్చే రూ.వెయ్యి పెన్షన్లలో రూ.800 ప్రధాని మోదీ ఇస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో వారు చేసే ప్రచారాన్ని నమ్మొద్దని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటివి మస్తుగా పుట్టించారన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులకు విజన్‌ లేదని, బీజేపీలో నిజం చెప్పే నాయకులు లేరని, అందుకే కేసీఆర్‌కు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ పాల్గొన్నారు. 

భలే టేస్టీగున్నాయే
పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత జగిత్యాల రోడ్‌షో నిర్వహించారు. ప్రసంగం మధ్యలో ఓ హోటల్‌ వద్దకు వెళ్లి.. అటుకులు తిన్నారు. ‘అరే.. అటు కులు భలే టేస్టీగా ఉన్నాయే..’అంటూ తిరిగి వెళ్లి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

 

>
మరిన్ని వార్తలు