త్వరలో త్రీడీ సినిమా చూపిస్తాం 

30 Oct, 2018 02:41 IST|Sakshi

నాలుగేళ్లలో చూసింది ట్రైలరే

టీఆర్‌ఎస్‌ యువజన విభాగం సమావేశంలో ఎంపీ కవిత 

సాక్షి, జగిత్యాల: ‘నాలుగేళ్లలో మేం చూపించింది ట్రైలర్‌ మాత్రమే. ఇంకా సినిమా చూపించలె. దీనికే ఇంత భయపడి.. అందరూ కలసి కూటమి కట్టారు. మాపై యుద్ధానికి వస్తున్నరు. నిజంగా మేం చూపిం చింది కేవలం ట్రైలర్‌ మాత్రమే.. ఇక సినిమా చూపిస్తే తట్టుకోగలరా?.. త్వరలో త్రీడీ స్క్రీన్‌పై సూపర్‌ సినిమా చూపిస్తాం’అని ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. సోమవారం జగిత్యాలలో జరిగిన టీఆర్‌ఎస్‌ యువజన విభాగం సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కరప్షన్‌ కు పుట్టిన కవల పిల్లలని విమర్శించారు.

తమ నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనలేని అభి వృద్ధి సాధిస్తే.. మహాకూటమి నాయకులకు ఏ మా త్రం కన్పించడం లేదన్నారు.  యువత భవిష్యత్తు కోసం పనిచేస్తున్న కేసీఆర్‌ ఓ వైపు.. ఆ పనులను అడుగడుగునా అడ్డుకునేందుకు వస్తున్న కూటమి వ్యక్తులు మరోవైపు ఉన్నారని అన్నారు.  రానున్న రోజుల్లో అద్భుతమైన బంగారు తెలంగాణను కచ్చితంగా నిర్మించుకోబోతున్నట్లు కవిత పేర్కొన్నారు.ఇటీవల ఏపీ పోలీసులు రూ. 50 లక్షలు జిల్లాకు తీసుకొస్తే.. వారిని స్థానిక పోలీసులు పట్టుకున్నారని, సత్యహరిశ్చంద్రులకు వారసులమని చెప్పుకునే టీడీపీ నేతలు ఇప్పటివరకూ దీనిపై ఎందుకు మాట్లా డటం లేదో జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోట్లతో తెలంగాణను ఆగం చేయలేరన్నారు.    

87 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ 
ఈ నాలుగేళ్లలో 1.09 లక్షల ఉద్యోగాల భర్తీకి అను మతి ఇస్తే.. టీఎస్‌పీఎస్సీ 87 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిందని కవిత తెలిపారు.  ఇప్పటి వరకు 32,681 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందన్నారు. టీఎస్‌ ఐ–పాస్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.34 లక్షల కోట్ల పెట్టుబడితో 8వేల పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించామని ఆమె వివరించారు. 
 

మరిన్ని వార్తలు