ఢిల్లీ సమస్యలపై సేవకురాలిగా ఉంటా..

28 Mar, 2019 15:59 IST|Sakshi
ముప్కాల్‌ మండలం రెంజర్లలో మాట్లాడుతున్న కవిత

గతేడాది రూ.150 కోట్లతో     ఎర్రజొన్నల కొనుగోళ్లు 

పసుపు బోర్డు ఏర్పాటు చేసే వరకు కృషి  

ఎన్నికల ప్రచార సభలో ఎంపీ కవిత

బాల్కొండ:  ఎన్నికల్లో ప్రజలు దీవించి అధిక మెజార్టీతో గెలిపిస్తే గల్లీలో సేవకురాలిగా.. ఢిల్లీలో సైనికురాలిగా పని చేస్తానని టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు.  బుధవారం ముప్కాల్‌ మండల కేంద్రం, రెంజర్ల గ్రామం, మెండోరా, బాల్కొండ మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గల్లీలో ప్రతి ఇంటి సమస్యను తెలుసుకుంటూ సేవకురాలి నవుతానన్నారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర హక్కులపై, నిధులపై సైనికురాలిగా పోరాటం చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు.  
రైతులకు.. 
ఎర్రజొన్న, పసుపు రైతులకు ఎప్పుడూ అండగా ఉంటానని కవిత పేర్కొన్నారు. గతేడాది ఎన్నికలు లేకున్నా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించి ఎర్ర జొన్నలను కొనుగోలు చేసిందన్నారు. ప్రస్తుత సంవత్సరం రైతులు ప్రభుత్వాన్ని అడగకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయని ఆరోపించారు. అయినా  ఎర్ర జొన్న రైతులకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ అందిస్తుందని భరోసా ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో అనేక మార్లు గళం వినిపించానన్నారు. పసుపు సాగు చేస్తున్న రైతులు పడే కష్టాలు తనకు తెలుసన్నారు. బోర్డు ఏర్పాటు చేసే వరకు కృషి చేస్తానన్నారు.

 మరింత అభివృద్ధి  చేస్తాం..  
నిజామాబాద్‌ జిల్లాను అన్ని రంగాల్లో మరిం త అభివృద్ధి చేస్తానని కవిత పేర్కొన్నారు. రెండు నెలల క్రితం ప్రజలు దీవించి అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ నాయకులను కూర్చోబెట్టా రన్నారు. ఇప్పుడు కూడ అధిక స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తే ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించవచ్చన్నారు. నిజామాబాద్‌ను సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు.  మరోసారి దీవించి  పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ తనయ కవిత నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. తనతో కాని పనులను తండ్రి వద్దకు తీసుకెళ్లి పనులు చేయించే కుమార్తె మన పార్లమెంట్‌ సభ్యురాలిగా కావడం ఎంతో అదృష్టమన్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంది, ఎంపీగా కవితమ్మను అధిక మెజార్టీతో గెలిపిస్తే పాలన సాఫీగా  సాగుతుందన్నారు. మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మధు శేఖర్, కోటాపాటి నరసహింహనాయుడు, బాల్కొండ ఎంపీపీ అర్గుల్‌ రాధ చిన్నయ్య, బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల అధ్యక్షులు దాసరి వెంకటేశ్, సామవెంకట్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి,  సర్పంచ్‌లు భూస సునీత, కొమ్ముల శ్రీనివాస్, మచ్చర్ల లక్ష్మీ రాజారెడ్డి, ఆకుల రాజారెడ్డి పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు