మా వాళ్లను విడిపించరూ..!

16 Jun, 2019 03:18 IST|Sakshi
వేడుకుంటున్న రాజు భార్య పిల్లలు, లచ్చన్న భార్య పిల్లలు

ఇరాక్‌ జైళ్లో కవ్వాల్‌ గ్రామస్తులు 

విడుదల చేయించాలని రెండు కుటుంబాల వేడుకోలు

జన్నారం(ఖానాపూర్‌): ‘మా నాన్న మాతో మాట్లాడక రెండు నెలలయితంది. ఇరాక్‌ దేశంలో జైళ్లో పడ్డాడట. అమ్మ వాళ్లు ఏడుస్తున్నరు. మా కోసం వేరే దేశం వెళ్లిన మా నాన్నను ఇంటికి తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలి. కేటీఆర్‌ సార్‌ మా మీద దయ చూపాలి, మా నాన్నను తీసుకురావాలి’అని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్‌ గ్రామానికి చెందిన కుంటాల లచ్చన్న పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కవ్వాల్‌ గ్రామానికి చెందిన లచ్చన్న, షేర్ల రాజు ఉపాధి కోసం 2015లో ఇరాక్‌ వెళ్లారు. వీసా కోసం నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఏజెంట్‌కు రూ.1.50 లక్షలు కట్టారు.

ఏజెంట్‌ విజిట్‌ వీసాతో వారిని అక్కడికి పంపించాడు. అక్కడికి వెళ్లాక ఏజెంట్‌ మోసం చేశాడని తెలిసింది.  దీంతో తెలిసిన వారి వద్ద ఉంటూ దొంగ చాటుగా పనిచేస్తూ జీవించారు. ఏడాది తర్వాత పనిచేసిన డబ్బులతో అఖా మా చేయించుకున్నారు. ఆ సమయంలో అప్పుల పాలయ్యారు. అఖామా వచ్చాక ఎర్బిల్‌లోని పాఠశాలలో పని దొరికింది. ఇద్దరూ అక్కడే పని చేస్తూ అఖామాకు చేసిన అప్పులు తీర్చారు. ఇక స్వదేశంలో చేసిన అప్పులే తీర్చాల్సి ఉంది. అప్పులు తీర్చి ఇంటికి వద్దామనుకున్నారు. ఏప్రిల్‌ 16న పోలీసులు వచ్చి ఎలాంటి కారణం లేకుండా వారిద్దరినీ పట్టుకెళ్లారు. ఎందుకు పట్టుకెళ్లారో.. ఎన్ని రోజులు జైళ్లో ఉంచుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది.  

మరిన్ని వార్తలు