రాష్ట్రంలో తొలి రైల్వే వర్క్‌షాప్‌

5 Feb, 2017 01:47 IST|Sakshi
రాష్ట్రంలో తొలి రైల్వే వర్క్‌షాప్‌

కాజీపేటలో వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌ యూనిట్‌
రూ. 300 కోట్లతో త్వరలో నిర్మాణం
- ఏడేళ్ల నిరీక్షణకు తెర
- 53 ఎకరాలను బదిలీ చేస్తున్నట్టు రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
- మరో 2, 3 రోజుల్లో బదిలీ ప్రక్రియ పూర్తి


సాక్షి, హైదరాబాద్‌: ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. వరంగల్‌ జిల్లా కాజీపేటలో దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో వ్యాగన్‌ పిరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాపు నిర్మాణం త్వరలో జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం–రైల్వేల మధ్య నెలకొన్న భూ బదలాయింపు సమస్య కొలిక్కి వచ్చింది. ఈ వర్క్‌షాపు ఏర్పాటుకు అవసరమైన 53 ఎకరాల భూమిని రైల్వేకు బదలాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం రైల్వేశాఖకు లేఖ రాసింది.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే కొత్త జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. ఈ ఇద్దరు అధికారులు స్నేహితులు కావటంతో వెంటనే ఎస్పీ సింగ్‌ దీనిపై దృష్టి సారించారు. కేవలం వారం రోజుల వ్యవధిలో దాన్ని కొలిక్కి తెచ్చి ఆ భూమిని స్వాధీనం చేస్తున్నట్టుగా జీఎంకు స్వయంగా లేఖ పంపారు. మరో రెండుమూడు రోజుల్లో ఈ బదలాయింపు ప్రక్రియ అధికారికంగా జరగనుంది. ఆ వెంటనే అక్కడ పనులు మొదలుపెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.

ఏడేళ్ల తర్వాత మోక్షం...
కాజీపేట వర్క్‌షాపుది వింత కథ. వాస్తవానికి ఇక్కడ కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉంది. 1982లో కోచ్‌ఫ్యాక్టరీ మంజూరు కాగా, ఇందిరాగాంధీ హత్యోదంతం తర్వాత సిక్కులపై ఊచకోత నేపథ్యంలో పంజాబ్‌ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 1985లో ఆ కోచ్‌ఫ్యాక్టరీని పంజాబ్‌కు బదిలీ చేసింది. అప్పటి నుంచి కోచ్‌ఫ్యాక్టరీ డిమాండ్‌ కాజీపేటలో కొనసాగుతూనే ఉంది. చివరకు 2010లో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉండగా కాజీపేటకు వ్యాగన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను మంజూరు చేసింది. తొలుత దీన్ని సికింద్రాబాద్‌కు ఇవ్వగా నేతల ఒత్తిడితో కాజీపేటకు మార్చారు. మడికొండలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందిన 53 ఎకరాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీనికి కేటాయించింది.

అయితే దేవాలయ మాన్యాన్ని సేకరించటంలో ఉన్న నిబంధనలతో ఆ అంశం కోర్టుకెక్కింది. దాన్ని సకాలంలో పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలం కావటంతో జాప్యం జరుగుతూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు సమస్య పరిష్కారమై ఆ భూమిని వరంగల్‌ కలెక్టర్‌కు స్వాధీనం చేశారు. ఈలోపు కేంద్రం మనసు మార్చుకుని వ్యాగన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను రద్దు చేసి దాని స్థానంలో వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాపును గత సంవత్సరం మంజూరు చేసి రూ.20 కోట్లు కేటాయించింది. కానీ సకాలంలో భూమిని రైల్వేకు అప్పగించకపోవటంతో ప్రయోజనం లేకుండా పోయింది. కొత్తగా వచ్చిన జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ గత వారం ఎస్పీసింగ్‌ను కలసి దీనిపై విజ్ఞప్తి చేయటంతో వారం రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఆయన రెండు రోజుల క్రితం జీఎంకు ఆమేరకు లేఖ రాశారు.

రెండు వేల మందికి ఉపాధి
సరుకు రవాణా వ్యాగన్‌లను ఎప్పటికప్పుడు ఓవర్‌హాలింగ్‌ చేయటం ఈ వర్క్‌షాపు పని. దీనిద్వారా ప్రత్యక్షంగా దాదాపు 500 మందికి, పరోక్షంగా 1500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌కు మంచి డిమాండ్‌ ఉన్నందున ఇక్కడ నిరంతరం పనులు కొనసాగనున్నాయి. నెలలో దాదాపు 150 వ్యాగన్లను ఓవర్‌హాలింగ్‌ చేసే సామర్థ్యంతో తొలుత వర్క్‌షాపును ప్రారంభిస్తారని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు