ఇంట్లో నర్సింహ.. బయట రిషి!

18 Sep, 2017 02:34 IST|Sakshi
ఇంట్లో నర్సింహ.. బయట రిషి!

‘కేబీఆర్‌ పార్క్‌’ స్నాచర్‌ విచారణలో ఆసక్తికర విషయాలు
► దసరా సందర్భంగా మరో స్నాచింగ్‌కు ప్లాన్‌
► అంతలోనే పోలీసులకు చిక్కిన వైనం
► జల్సాలకు అలవాటుపడి స్నాచింగ్‌ బాట
► కుటుంబ సభ్యులకు తెలిసే చోరీలు


సాక్షి, హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్కులో 12 ఏళ్లుగా స్నాచింగ్‌లు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న స్నాచర్‌ నర్సింహ అలియాస్‌ రిషిని బంజారాహిల్స్‌ పోలీసులు విచారిస్తున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి రెండు నెలలకోసారి కేబీఆర్‌ పార్కులో స్నాచింగ్‌లకు పాల్పడటమే కాక.. జీహెచ్‌ఎంసీ వాక్‌వేకు వచ్చే ప్రేమ జంటలను బెదిరించి వారి నుంచి నగదు, నగలు తస్కరించేవాడని తేలింది. కార్మికనగర్‌ లో నివసించే నర్సింహ జల్సాలకు అలవాటు పడి స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

చోరీ చేసిన నగలను జేబులో వేసుకుని పరారు కాకుండా పార్క్‌ గ్రిల్‌ దూకి అక్కడే ఓ బండ కిందనో, చెట్టు చాటునో దాచి వెళ్లిపోయేవాడు. రెండు, మూడు గంటల తర్వాత అక్కడికి వచ్చి వాటిని తీసుకెళ్లేవాడు. పొరపాటున పోలీసులకు దొరికినా వెతికితే తన వద్ద ఏదీ ఉండదని అలా చేసేవాడు. కుటుంబ సభ్యులకు తెలిసే నర్సింహ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. నగలను తల్లికే ఇచ్చేవాడని, ఆమే వాటిని విక్రయించేదని తెలుస్తోంది. దసరా ఖర్చుల కోసం మరోసారి స్నాచింగ్‌ చేద్దామని ప్లాన్‌ వేస్తున్న సమయంలోనే నర్సింహ పోలీసులకు దొరికిపోయాడు.

స్నాచర్‌ కోసం ముమ్మరవేట..
సెలబ్రిటీలు వాకింగ్‌ చేసే కేబీఆర్‌ పార్కులో ఏకంగా 12 స్నాచింగ్‌లు జరగడం, నిందితు డు కళ్లుగప్పి పారిపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో పోలీసులు పకడ్బందీ వ్యూహం పన్నారు. 15 మంది పోలీసులు గత 25 రోజులుగా సివిల్‌ డ్రెస్‌లో వాకర్లలాగా స్నాచర్‌ కోసం జల్లెడ పట్టారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వారిని వెంబడించేవారు. అంతేకాక పార్కు లోపల, జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్భంగా ఖర్చుల కోసం మళ్లీ స్నాచింగ్‌ జరిగే అవకాశం ఉంటుందని భావించిన పోలీసులు కేబీఆర్‌ పార్కు వద్ద బందోబస్తును పెంచారు.

ఇంకోవైపు స్నాచర్‌ నర్సింహ కూడా ఎప్పటికప్పుడు తన రూట్‌ మార్చేసే వాడు. స్నాచింగ్‌కు రెండు రోజుల ముందు రెక్కీ నిర్వహించేవాడు. సెల్‌ఫోన్‌తో పార్క్‌ లోపలికి వెళ్లే నర్సింహ అక్కడే ఉన్న బెంచీ లపై కూర్చొని సెల్‌ఫోన్‌ ఆపరేట్‌ చేస్తున్నట్లు నటిస్తూ జంటగా వెళ్లే వారిని అనుసరించే వాడు. ఆ సమయంలో తనకు కాల్స్‌ రాకుండా.. ఎవరూ తనను ట్రేస్‌ చేయకుండా ఫోన్‌ను ఫ్లయిట్‌మోడ్‌లో పెట్టేవాడు.

మోటుగా ఉందని పేరు మార్చేశాడు
స్నాచర్‌ నర్సింహ తన స్నేహితుల వద్ద పేరును మార్చుకున్నాడు. అమ్మాయిల వద్ద నర్సింహ అంటే మోటుగా ఉంటుందని రిషి అని పెట్టుకున్నాడు. ఇతనికి ఒక గర్ల్‌ఫ్రెండ్‌ కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దసరాకు మరో దొంగతనం చేసి ఏదైనా టూర్‌ వెళ్లాలని నర్సింహ ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపుగానే పోలీసులకు చిక్కాడు.

మరిన్ని వార్తలు