'కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు'

10 Nov, 2018 16:43 IST|Sakshi

బంగారు తెలంగాణనే తన లక్ష్యమంటూ పదవిని చేపట్టిన తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌, తన పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ అన్నారు. అధికారంలోకి వస్తే దళితుడినే సీఎం చేస్తానంటూ మోసం చేశారని, ఓయూ, కేయు విద్యార్థులు, ఉద్యోగస్తులు తమ భవిష్యత్‌ను పణంగా పెట్టి పోరాడితే.. కేసీఆర్ నిరాహార దీక్ష డ్రామాతో లబ్ధి పొందారని విమర్శించారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, కానీ ఆ  ప్రయెజనాలను విస్మరించి  కుటుంబ ప్రయోజనాల కోసమే తెలంగాణ సాధించామనేట్లు సీఎం కేసీఆర్‌ వ్యవహరించారని లక్ష్మణ్‌ అన్నారు. విద్యార్థులను నియమకాలంటూ మోసం చేశారని, పోటీ పరీక్షలు రాస్తే ఫలితాలు రావడం లేదని ఎ‍ద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సాగులోకి తెస్తామని కేసీఆర్‌ చెప్పగా.. ఆ హామీ నెరవేరకపోగా గడిచిన నాలుగేళ్లలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలో మహిళలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వలేని ఘనత కేసీఆర్‌దేనని విమర్శించారు. చివరికీ బతుకమ్మ  చీరల పేరిట రూ. 250 కోట్ల కుంభకోణం చేశారని మండిపడ్డారు. నెరేళ్ల దళిత యువతను జైలుపాలు చేశారన్నారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వరు, ఉద్యమాలను అణిచి వేశారని లక్ష్మణ్‌  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిస్ట్‌లకు  ఇళ్ళు ఇవ్వకుండా దగా చేశారన్నారు. ఇలా అన్ని వర్గాల వారినీ మోసం చేసిన టీఆర్‌ఎస్‌ సర్కారును ప్రజలే శిక్షిస్తారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు