కాటన్‌ కన్నా.. నిజాం మిన్న!

10 Nov, 2017 01:52 IST|Sakshi

ఆయన పాలన ఉజ్వల తెలంగాణ చరిత్రలో భాగమే

సమైక్య పాలనలో దాన్ని వక్రీకరించారు

రజాకార్ల పేరుతో చెడు ప్రచారం చేశారు

వాస్తవాలతో చరిత్రను తిరగ రాస్తామని సభలో ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: నిజాం రాజును తరచూ పొగడ్తలతో ముంచెత్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గురువారం శాసనసభ వేదికగా మరో అడుగు ముందుకేసి మరీ కీర్తించారు. రజాకార్ల దురాగతాలంటూ నిజాం పాలన తీరుపై చెడు ప్రచారం జరిగిందని.. కానీ ఆయనది గొప్ప గుణమన్నారు. ‘‘నిజాంను పొగిడితే నన్ను నయా నిజాం అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

నేను చెప్పేదొ క్కటే. సమైక్య పాలనలో నిజాం చరిత్రను వక్రీకరించారు. వాస్తవాలతో దాన్ని నేను తిరగరాస్తా..’’అని ప్రకటించారు. హిందూ ముస్లిం సహా అన్ని మతాలవారూ కలసి జీవించడం మినహా మరో మార్గం లేదని..   పరస్పరం  ఏహ్యభావం తొలగి సంతోషంగా కలసి జీవించే పరిస్థితి రావాలన్నారు.

నిజాంను కీర్తిస్తే తప్పా..
తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాం వారసుల విన్నపం మేరకు తాను నిజాం సమాధిని దర్శించానని.. దీనిపై అప్పట్లో తనను చాలా విమర్శించారని కేసీఆర్‌ చెప్పారు. ‘‘నిజాం సమాధిని ఎందుకు సందర్శించారంటూ ఓ ఆంధ్రా విలేకరి నన్ను అడిగారు. అప్పుడు నేను ‘మీరు కాటన్‌ దొర ఉత్సవాలు ఎందుకు చేస్తర’ని అడిగిన. దాంతో ఆ విలేకరి ‘కాటన్‌ మాకు ఆనకట్ట కట్టించాడు. సాగుకు అవకాశం కల్పించాడు’అని చెప్పిండు. మరి 200 ఏళ్లపాటు దేశాన్ని దోచుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వంలోని మిలటరీ ఇంజనీర్‌ కాటన్‌ను పూజిస్తే... నిజామాబాద్‌లో నిజాంసాగర్‌ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన నిజాంను కీర్తించడం తప్పా? కాటన్‌ మనోడు కాదు.

కానీ ఉజ్వల తెలంగాణ చరిత్రలో నిజాం పాలన భాగం. ఆయన మనవాడు. హైదరాబాద్‌ సంస్థానం విలీనమైన తర్వాత నిజాం రాజ్‌ప్రముఖ్‌గా ఉండగా.. ఓసారి ఆయన డ్రైవర్‌కు చేయి విరిగింది. ఇక్కడ బొక్కల (ఎముకల) ఆస్పత్రి లేక మద్రాసుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన నిజాం.. తాను రాజుగా ఉండగా హైదరాబాద్‌లో బొక్కల దవాఖాన కట్టకపోవటం తప్పేనంటూ.. నిజాం బొక్కల దవాఖాన (ప్రస్తుత నిమ్స్‌)ను నిర్మించిండు.

దానికి స్థలమిచ్చి, సొంత డబ్బులతో నిర్మించిండు. చైనాతో యుద్ధం తర్వాత మన దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తనకు చెందిన ఆరు టన్నుల బంగారాన్ని నాటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రికి ఇచ్చిండు. తిరిగి చెల్లిస్తానని శాస్త్రి అన్నా ఒప్పుకోలేదు. ఇది వాస్తవం. నిజాం పాలన గొప్పతనం జనంలోకి పోయేలా చరిత్రను తిరగరాస్తం..’’అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు