ఎవుసం ఎట్లుందో సూద్దామని

15 Sep, 2014 00:22 IST|Sakshi

 జగదేవ్‌పూర్:   ఎర్రవల్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలోని పంటలను సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఎవుసం ఎట్లుందని నౌకర్లను అడిగారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనను కలిసేందుకు వచ్చిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారు. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్ నాయకులతో ఉప ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించారు.

 శనివారం ఫాంహౌస్‌కు వచ్చిన ముఖ్యమంత్రి ఇక్కడే బస చేశారు. దీంతో జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, గజ్వేల్ సీఐ అమృతారెడ్డి, ఎస్‌ఐ వీరన్న వ్యవసాయ క్షేత్రం వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. సీఎం వెళ్లేవరకు వీరంతా ఇక్కడే ఉన్నారు. ఆదివారం సాయంత్రం 6.20 నిమిషాల ప్రాంతంలో కేసీఆర్ ఫాంహౌస్ నుంచి రాష్ట్ర రాజధానికి  వెళ్లారు.

 విద్యార్థిని రాజేశ్వరి కుటుంబాన్ని ఆదుకుంటా..
 అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థిని రాజేశ్వరి కుటుం బాన్ని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సీ ఎం తిరిగివెళ్తున్న క్రమంలో ఫాంహౌస్ పక్కనే ఉన్న శివారువెంకటాపూర్ గ్రామ ప్రజలు ఆయన కాన్వాయ్‌ను ఆపి అనారోగ్యంతో మృతి చెందిన రాజేశ్వరి కుటుంబ పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన  ఎవుసం ఎట్లుందో సూద్దామని వచ్చానని.. మళ్లొచ్చిన్నాడు తప్పకుండా సాయం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు.

 రెండుమూడు రోజుల్లో నేనే వస్తా...
 ములుగు:  ఎర్రవల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రం నుంచి   హైదరాబాద్‌కు వెళుతున్న సీఎం కేసీఆర్  మర్కుక్ గ్రామంలో కొద్దిసేపు ఆగారు. సీఎం వెళుతున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న సర్పంచ్ నర్సింలు స్థానికులతో కలిసి రోడ్డుపై వేచి ఉన్నారు. ఇది చూసిన సీఎం తన కాన్వాయ్‌ని ఆపి వారితో మాట్లాడారు.  తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మర్కుక్‌వాసులు వినతిపత్రం అందజేశారు. రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా అధికారులతో వచ్చి సమస్యలను పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.  ఎంపీటీసీ గీతారాంరెడ్డి, ఉప సర్పంచ్ నవనీతమాధవరెడ్డి, వార్డు సభ్యుడు మల్లేష్, నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు