సింగరేణి కార్మికులకు సీఎం వరాలు

22 Aug, 2018 21:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణి కార్మికులకు వరాల జల్లు కురిపించారు. సింగరేణి కార్మికుల లాభాల వాటాను ప్రతీ ఏటా పెంచుతూ వస్తున్న సీఎం కేసీఆర్.. ఈ ఏడాది కూడా వారికి శుభవార్త చెప్పారు. 2017-18సంవత్సరానికి గాను కార్మికులకు 2 శాతం లాభాల వాటాను పెంచారు. దీంతో గత ఏడాది 25శాతం లాభాల వాటా అందుకున్న కార్మికులు.. ఈ ఏడాది 27 శాతం వాటా అందుకోబోతున్నారు.  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకెఎస్) గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత నేతృత్వంలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, టీబీజీకేఎస్ నాయకులు ప్రగతి భవన్ లో సీఎంతో సుమారు 45 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కార్మికుల లాభాల వాటా పెంచినందుకు సీఎంకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.
 
తాజాగా ప్రకటించిన లాభాల వాటాను ఏయే తేదీల్లో కార్మికుల ఖాతాల్లో డిపాజిట్ చేయబోతున్నారన్న దానికి సంబంధించి స్పష్టమైన వివరాలేవి వెల్లడి కాలేదు. సీఎం నుంచి సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు ఆదేశాలు జారీ అయిన వెంటనే ఆ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే డిపెండెంట్ ఉద్యోగాలకు బదులు సింగరేణిలో కారుణ్య నియామకాలు కొనసాగుతున్నాయి. మెడికల్ అన్‌ఫిట్ అయ్యే కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఈటల రాజేందర్, ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు