వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌

2 Jul, 2017 01:19 IST|Sakshi
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌

వచ్చే ఏడాది నుంచే.. కేసీఆర్‌ నిర్ణయం
- ‘రైతు సంక్షేమం – వ్యవసాయాభివృద్ధి’పై ఉన్నతస్థాయి సమీక్ష
- కల్తీ విత్తనాల రాకెట్లో కొందరు
- వ్యవసాయాధికారులున్నారని ఆవేదన
- సాగు పద్ధతులపై స్టేట్‌ రిసోర్స్‌
- పర్సన్లకు తానే శిక్షణ ఇస్తానని వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది నుంచి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలని, ఈ రంగానికి భారీగా నిధులు పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,500 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతీ క్లస్టర్‌లో రైతులు ఎప్పటికప్పుడు సమావేశం కావడానికి వీలుగా రైతు వేదికలు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. సంఘటిత శక్తిలో ఉన్న బలమేంటో రైతులకు వివరించి, వారిని ఏకం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యవసాయరంగంలో ఉత్పాదకతను పెంచేందుకు అనుసరించాల్సిన ఆధునిక, శాస్త్రీయ పద్దతులపై అవగాహన కల్పించేందుకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

వ్యవసాయరంగాన్ని మరింత విస్తరించాల్సి ఉందని, దీనికోసం వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని, అవసరమైతే రిటైర్డ్‌ వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సేవలు కూడా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామాల్లో భూ రికార్డులు సక్రమంగా నిర్వహించేందుకు, కల్తీ విత్తనాల నివారణకు ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటుందని సీఎం వెల్లడించారు. ‘రైతు సంక్షేమం – వ్యవసాయాభివృద్ధి’పై ప్రగతి భవన్లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు ఎస్‌.నర్సింగరావు, పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌మోహన్, ఉద్యానవన శాఖ కమిషనర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు.

కల్తీ విత్తనాలపై కఠినం...
కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ‘రైతులను మోసం చేసే కల్తీ విత్తనాల రాకెట్లో కొంత మంది వ్యవసాయాధికారులు కూడా భాగస్వాములు కావడం బాధాకరం. ఆ రాకెట్‌ అంతుచూడాలి. వారి గుట్టు రట్టు చేయాలి. ఇతర రాష్ట్రాఅ నుంచి కూడా దీనిని నడుపుతున్నారు. వారి వివరాలు కూడా తీసుకుని ఈ దందాకు అడ్డుకట్ట వేయాలి. విజిలెన్స్‌ దాడులు కొనసాగాలి. కల్తీ విత్తనం తయారీ, పంపిణీ, అమ్మకాలను దారుణమైన నేరాలుగా పరిగణించాలి.

బాధ్యులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలి. కఠినంగా శిక్షలు పడేలా చూడాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి. గ్రామాల్లో కూలీలు దొరికే పరిస్థితి లేదు. యాంత్రీకరణమే అంతిమ పరిష్కారం. వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరగాలి. దీనివల్ల పనులు వేగంగా జరగడంతోపాటు, పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుంది. ప్రభుత్వం కూడా తగిన సాయం అందిస్తుంది. ఈ విషయంలో రైతులకు సరైన అవగాహన కల్పించాలి’అని సీఎం సూచించారు.

అధికారులు సూచించిన పంటలే వేయాలి...
ఆయా నేలల స్వభావాన్ని బట్టి ఎక్కడ ఏ పంటలు వేయాలనే విషయంలో అధికారులు రైతులకు తగిన సూచనలు చేయాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘ఎవరిష్టం వచ్చినట్లు వారు పంటలు వేసే విధానం పోవాలి. అధికారులు సూచించిన పంటలే వేయాలి. డిమాండ్‌కు తగ్గట్లు పంటల సాగుండాలి. రాష్ట్రం మొత్తాన్ని క్రాప్‌ కాలనీలుగా విభజించి, అన్ని రకాల పంటలు పండించాలి.

దీనివల్ల దిగుబడి పెరుగుతుంది. గిట్టుబాటు ధర వస్తుంది’అని కేసీఆర్‌ చెప్పారు. ‘రాష్ట్ర అవసరాలను గుర్తెరిగి పంటలను సాగు చేయాలి. రాష్ట్రంలో మనుషులకు ఎంత మొత్తంలో ఆహార పదార్ధాలు కావాలి. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, నూనె గింజలు ఎంత అవసరం పడతాయో లెక్కించాలి. నేలల స్వభావానికి అనుగుణంగా పండే పంటలు పండించి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలి’అని సీఎం అన్నారు.

రైతులు సంఘటితం కావాలి...
‘రైతులు సంఘటితం కావాలి. గ్రామస్థాయిలో గ్రామరైతు సంఘాలు ఏర్పాటు చేయాలి. తర్వాత మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమాఖ్యల నిర్మాణం కావాలి. మండల రైతు సమాఖ్య సూచించిన తర్వాతే మార్కెట్‌ కు సరుకులు తీసుకురావాలి. గిట్టుబాటు ధర వచ్చే విషయంలో రైతులకు, వ్యాపారులకు మండల రైతు సమాఖ్య అనుసంధాన కర్తగా ఉంటుంది. గిట్టుబాటు ధర రాకపోతే వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్ర రైతు సంఘం కొనుగోలు చేస్తుంది. దీనికోసం రాష్ట్ర రైతు సంఘం దగ్గర నిధులుంటాయి.

బడ్జెట్లోనే మూల నిధిని కేటాయిస్తాం. ఈ సారి వ్యవసాయ బడ్జెట్‌ కూడా బాగా పెంచుతాం. వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెడతాం. రైతు సంఘాలకు పర్మిట్లు ఇచ్చి ఉత్పత్తులను కొనిపిస్తాం. ప్రాసెసింగ్‌ చేపించి, మార్కెట్లో విక్రయించే విధానాలు కూడా తెస్తాం. రైతులకు కనీస మద్దతు ధర రావడమే లక్ష్యం. రైతులను సంఘటిత పరిచి, వారికి చేదోడు వాదోడుగా ఉండే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది’అని సీఎం పేర్కొన్నారు.

నేనే స్వయంగా శిక్షణ ఇస్తా..
‘రైతులకు ఆధునిక, శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. హైదరాబాద్‌లో దాదాపు వెయ్యి మంది స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్స్‌కు నేనే స్వయంగా శిక్షణ ఇస్తా’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ‘ఇకపై భూమి రికార్డులు సక్రమంగా నిర్వహిస్తాం. ఎవరు భూమి కొన్నా, అమ్మినా ఆ వివరా>లను రిజిస్ట్రార్‌ విధిగా గ్రామ రైతు సంఘాలకు తెలియచేయాలి. రిజిస్ట్రేషన్లు, భూమి అమ్మకం, కొనుగోలు విషయంలో కూడా పూర్తి పారదర్శకత ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటాం’అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు