టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌

14 Dec, 2018 10:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌)ను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ప్రభుత్వపరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను తుచ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా అత్యంత నమ్మకస్తుడు, సమర్ధుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడైంది.

జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండటంతో కేసీఆర్‌పై పనిభారం పెరుగుతోందని భావించి టీఆర్‌ఎస్‌ కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా స్పష్టమవుతోంది. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించడంతో ఆయనకు టీఆర్‌ఎస్‌ నాయకులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు