24న యాదాద్రికి సీఎం కేసీఆర్‌ రాక

22 Nov, 2017 02:04 IST|Sakshi

అభివృద్ధి పనులపై సమీక్ష చేయనున్న ముఖ్యమంత్రి

సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 24న యాదాద్రికి రానున్నారు. తిరుమల తరహాలో ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధి పనులపై సమీక్ష చేయనున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ప్రధానాలయం, టెంపుల్‌ సిటీ, నృసింహ, జింకల పార్క్, నలువైపులా రహదారులు, గిరిప్రదర్శన, ప్రెసిడెన్షియల్‌ భవనాలు వంటి అన్ని పనుల పురోగతిపై పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు. సుమారు రూ.734.7 కోట్లతో తొలి విడత పనులకు అంచనాలు రూపొందించిన వైటీడీఏ ఇప్పటి వరకు రూ.350 కోట్ల మేర పనులను చేసింది. అయితే ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు బడ్జెట్‌లో మంజూరు చేస్తూ వచ్చింది. వీటికి అదనంగా మరో రూ.350 కోట్ల అవసరం అవుతాయని సాంకేతిక కమిటీ ఇటీవల పంపిన నివేదికకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఇందులో రూ.200 కోట్లను విడుదల చేసిందని వైటీడీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన రూ.100 కోట్లలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం రూ.25 కోట్లను కూడా విడుదల చేసింది. పనులను వేగవంతంగా చేసి నిర్ణీత సమ యంలో భక్తులకు స్వయం భూ దర్శనాలు కల్పించడానికి అవసరమైన రూ.350 కోట్లకు గాను రూ.200 కోట్లను మంజూరు చేసింది. మిగతా రూ.200 కోట్లను జరిగిన పనుల ఆధారంగా మంజూ రు చేయనుంది. రెండో విడతలో చేపట్టే 600 ఎకరాల్లో టౌన్‌షిప్, 148 ఎకరాల్లో పార్కింగ్‌ వసతి, కళ్యాణ కట్ట, విష్ణు పుష్కరిణి వంటి మరికొన్ని పనుల డీపీఆర్‌ రూపొందించ డానికి కన్సెల్టెన్సీ సంస్థకు అప్పగించారు. సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, యాదాద్రి పనులపై ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ నివేదికలు అందజేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు